విదేశాల నుంచి నేడు రానున్న మరో ఆరు ప్రత్యేక విమానాలు!

11-05-2020 Mon 10:39
  • 300 మంది ప్రయాణికులతో లండన్ నుంచి బెంగళూరు చేరిక 
  • శాన్ ఫ్రాన్సిస్కో, అబుదాబి నుంచి హైదరాబాద్ రానున్న విమానాలు
  • కౌలాలంపూర్ నుంచి చెన్నైకు, ఢాకా నుంచి ముంబైకు రెండు విమానాలు
Vandebharat special flights
విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ‘వందే భారత్’ మిషన్ ద్వారా మన దేశానికి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఓ ప్రత్యేక విమానం లండన్ నుంచి బెంగళూరుకు ఇవాళ చేరుకుంది. మూడు వందల మంది ప్రయాణికులతో లండన్ నుంచి బయలుదేరిన ఈ విమానం ఢిల్లీ మీదుగా ఈరోజు తెల్లవారుజామున బెంగళూరుకు చేరుకుంది.

వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చేందుకు ఇంకా ఆరు ప్రత్యేక విమానాలు ఈరోజు నడుస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై మీదుగా హైదరాబాద్ కు, అబుదాబి నుంచి హైదరాబాద్ కు, కౌలాలంపూర్ నుంచి చెన్నైకు, ఢాకా నుంచి ముంబైకు, దుబాయ్ నుంచి కొచ్చికి, బహ్రెయిన్ నుంచి కోజికోడ్ కు ఈ ప్రత్యేక విమానాలు చేరుకోనున్నాయి.