chicken: పెరిగిపోయిన చికెన్ రేట్లు.. కొనకుండానే వెనుదిరుగుతున్న సామాన్యుడు

  • నెల క్రితం చికెన్‌ ధర కిలోకి రూ.50
  • రెండు వారాల క్రితం రూ.120
  • ప్రస్తుతం రూ.220
chicken rates

కరోనా భయంతో నెల రోజుల క్రితం ఎన్నడూ లేనంతగా తగ్గిన చికెన్ ధరలు ప్రస్తుతం మండిపోతున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కిలో చికెన్‌ రూ. 220కి చేరింది. లాక్‌డౌన్‌తో ఆదాయం కోల్పోయిన సామాన్య ప్రజలు పెరిగిన ధరలతో చికెన్‌ ముక్కలకు దూరమవుతున్నారు. ఆ డబ్బుతో కూరగాయలు కొనుక్కోవడానికే ఆసక్తి చూపుతున్నారు.  

కరోనా భయంతో నెల రోజుల క్రితం కిలో చికెన్‌ రూ.50కే లభ్యమైన విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో కోళ్లను ఉచితంగా కూడా ఇచ్చేశారు. అయితే, ఆ తర్వాత ప్రజల్లో అవగాహన కల్పించడంతో చికెన్ పట్ల భయం తగ్గింది. దీంతో కొన్ని రోజులుగా గ్రేటర్‌ పరిధిలో చికెన్ ధర రోజురోజుకీ పెరిగిపోతోంది.

రెండు వారాల క్రితం కిలో చికెన్‌ ధర రూ.120 ఉండగా, ప్రస్తుతం మరో రూ.80 నుంచి రూ.100 మధ్య పెరిగింది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తుండడంతో మాంసాహారులు చికెన్‌ తినాలని కోరుకుంటున్నారు. అయితే, ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యుడు చికెన్‌ కొనలేకపోతున్నాడు.

More Telugu News