Manmohan Singh: అస్వస్థతతో ఎయిమ్స్‌లో చేరిన మన్మోహన్ సింగ్.. త్వరగా కోలుకోవాలంటూ నేతల ఆకాంక్ష!

  • జ్వరం, చాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిక
  • ప్రస్తుతం నిలకడగానే ఆరోగ్యం
  • త్వరగా కోలుకోవాలంటూ నేతల ట్వీట్లు
Ex PM Manmohan Singh Adimitted in AIIMS

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అస్వస్థతతో నిన్న సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. 87 ఏళ్ల మన్మోహన్‌ ప్రస్తుతం కార్డియో-థొరాసిక్ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని,  ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్నారని మన్మోహన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. జ్వరం, చాతీలో నొప్పితో బాధపడుతుండడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్టు పేర్కొన్నాయి. రాత్రి 8:45 గంటల సమయంలో కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీశ్ నాయక్ ఆధ్వర్యంలో ఆయనను ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్టు ఆ వర్గాలు వివరించాయి.

మన్మోహన్‌సింగ్ త్వరగా కోలుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆకాంక్షించారు. మన్మోహన్ త్వరగా కోలుకోవాలని తనతో సహా కోట్లాదిమంది భారతీయులు కోలుకుంటున్నారని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్, ఒమర్ అబ్దుల్లాలు కూడా మన్మోహన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన ఆసుపత్రిలో చేరారన్న వార్త బాధాకరమని, ఆయన త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఆయన మార్గదర్శనం దేశానికి అవసరమని అన్నారు. శివసేన నేత ఆదిత్య థాకరే, ఎన్సీపీ నేత, బారామతి ఎంపీ సుప్రియ సూలే తదితరులు కూడా మాజీ ప్రధాని త్వరగా కోలుకుని ఇల్లు చేరాలని ఆకాంక్షించారు.

More Telugu News