Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి అయినా ఉదయగిరి స్మృతులు ఎప్పటికీ మధురమే: వెంకయ్యనాయుడు

  • ఉపరాష్ట్రపతి భావోద్వేగభరిత పోస్టు
  • ఉదయగిరి తన రాజకీయ సోపానంలో తొలి మెట్టు అని వెల్లడి
  • ప్రతిరోజు ఉదయగిరి ప్రజలకు ఫోన్ చేస్తున్నట్టు వివరణ
Venkaiah Naidu recollects his memories with Udayagiri

తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం గురించి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ఫేస్ బుక్  ఖాతాలో అంతే సుదీర్ఘమైన పోస్టు చేశారు. ఉపరాష్ట్రపతి అయినా ఉదయగిరి స్మృతులు ఎప్పటికీ మధురమే అనే శీర్షికతో తన రాజకీయ జీవితాన్ని వివరించారు. ఇవాళ తాను భారతదేశానికి ఉపరాష్ట్రపతిని అయినా, తాను తొలి అడుగు వేసింది మాత్రం ఉదయగిరిలోనే అని స్పష్టం చేశారు. ఒక సాధారణ విద్యార్థి నాయకుడిగా మొదలుపెట్టి, ప్రజల నమ్మకంతో ఎమ్మెల్యేనయ్యానని తెలిపారు. అందుకే ఉదయగిరిని తన రాజకీయ సోపానంలో తొలి మెట్టుగా భావిస్తానని వెల్లడించారు.

ఆనాడు తాను డబ్బుతో గెలవలేదని, ప్రజలే 1978, 83లో గెలిపించి అసెంబ్లీకి పంపారని గర్వంగా వివరించారు. 83లో తన ప్రత్యర్థికి మద్దతుగా ప్రచారం చేసేందుకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా వచ్చారని, అయితే ప్రజలందరూ ఆమె హెలికాప్టర్ ను చూడ్డానికి వచ్చారే తప్ప ఆమె ప్రచారం చేసిన అభ్యర్థిని మాత్రం గెలిపించలేదని చమత్కరించారు. ఇక నాడు ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ఉదయగిరి ప్రజలు తనపైనే నమ్మకం ఉంచారని, ఎన్టీఆర్ గాలి కూడా ఉదయగిరిని తాకలేకపోయిందంటే అది నాటి ప్రజల సడలని విశ్వాసానికి నిదర్శనం అని స్పష్టం చేశారు.

రాజకీయ ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, కేంద్రంలో జాతీయ పార్టీ అధ్యక్షుడ్ని అయినా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నా, భారతదేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిలో కొనసాగుతున్నా గానీ తన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన ఉదయగిరి జ్ఞాపకాలే సదా స్మరణకు వస్తుంటాయని వెంకయ్యనాయుడు భావోద్వేగాలతో స్పందించారు. ఆ రోజుల్లో తాను ప్రచారానికి వెళితే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకువచ్చి హారతి ఇచ్చి మరీ తనకు రూ.200, రూ.500 ఇచ్చి ఆశీర్వదించేవారని గుర్తు చేసుకున్నారు.

1977 ప్రాంతంలో ముస్లిం వర్గంతో తనకు పెద్దగా పరిచయం లేదని, ఆ తర్వాత క్రమంగా ముస్లింలు సైతం తన అభిమానులుగా మారారని, వారే తన జీపుకు డీజిల్ పోయించేవారని, రుచికరమైన స్థానిక వంటకాలతో తనను అభిమానించేవారని వివరించారు. ప్రత్యర్థులు కూడా రాజకీయాల వరకే విభేదాలు చూపించేవారని, చెంచురామయ్య, జానకీరామ్, రాజమోహన్ రెడ్డి తదితరులు ఏనాడూ తనను శత్రువుగా చూడలేదని తెలిపారు. ఓ దశలో ఉదయగిరి నియోజకవర్గంలో పురుషులు తన వైపు నిలిచేందుకు ఊగిసలాడినా, మహిళలు ఎంతో ఆదరించిన విషయం మరువలేనని వెంకయ్య పేర్కొన్నారు.

ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా తాను ఇంటికే పరిమితం అయ్యానని, అందుకే ఈ విషయాలన్నీ జ్ఞప్తికి వస్తున్నాయని, అందుకే ప్రతిరోజు ఉదయగిరి నియోజకవర్గంలోని వారందరికీ ఫోన్లు చేస్తున్నానని వెల్లడించారు. స్వయంగా ఫోన్ చేసి పలకరిస్తుంటే వారి సంతోషం అంతాఇంతా కాదని, వారికంటే తానే ఎక్కువగా ఆనందిస్తున్నానని వెంకయ్య వ్యాఖ్యానించారు. వారితో మాట్లాడుతుంటే, లాక్ డౌన్ నిబంధనలు మర్చిపోయి ఉదయగిరిలో ప్రత్యక్షంగా పర్యటిస్తున్నానా అనేంత అనుభూతి కలుగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు తాను యువకుడిగా ఉన్నప్పటి ఫొటోలను కూడా పంచుకున్నారు.

More Telugu News