Corona Virus: కరోనా మృత్యుహేల... దగ్గరకు రాని బంధువులు, తండ్రి మృతదేహంతో ఒంటరి చిన్నారి!

  • తమిళనాడులో హృదయ విదారక ఘటన
  • కరోనా సోకి ఆసుపత్రిలో భార్య, తల్లి
  • ప్రమాదంలో మరణించిన అయ్యనార్
  • విషయం తెలియక మృతదేహంతోనే చిన్నారి
Boy Spen 14 hours with Father Dead body

అమ్మ, నాన్నమ్మలు కరోనాతో ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే తండ్రి ఓ రోడ్డు ప్రమాదం కారణంగా చనిపోయాడు. ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో తోచని పదేళ్ల బాలుడు, దాదాపు 14 గంటల పాటు మృతదేహంతో ఒంటరిగా గడపాల్సి వచ్చిన హృదయ విదారక ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే, విల్లుపురం జిల్లా, కండాచ్చిపురం సమీపంలో అయ్యనార్ (35) కుటుంబం నివాసం ఉంటోంది. అయ్యనార్ భార్య, తల్లికి కరోనా సోకడంతో వారిద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు.

ఇటీవల అయ్యనార్ రోడ్డు ప్రమాదానికి గురి కాగా, ప్రమాద బాధితులకు చికిత్సను అందించలేమంటూ అతన్ని వైద్యులు డిశ్చార్జ్ చేసి, ఇంటికి పంపగా, పరిస్థితి విషమించి కన్నుమూశాడు. తండ్రి మరణించాడని తెలుసుకోలేకపోయిన బాలుడు, రాత్రంతా మృతదేహం పక్కనే నిద్రించాడు. ఉదయం తండ్రిని లేపడానికి ప్రయత్నించి, విఫలమై, బయట దీనంగా కూర్చుండిపోయాడు.

ఈలోగా, అటు వచ్చిన ఓ వ్యక్తి, బాలుడిని ప్రశ్నించి, ఇంట్లోకి వెళ్లగా, కుళ్లిన వాసనతో ఉన్న అయ్యనార్ మృతదేహం కనిపించింది. దీంతో విషయాన్ని అధికారులకు తెలియజేసినా, వారు స్పందించలేదు. ఈ విషయం స్థానిక మీడియాలో రావడంతో, అతనికి అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్థులకు అనుమతి లభించింది.

ఇక తన భర్తను చివరిసారిగా చూసుకునేందుకు అనుమతించాలని అయ్యనార్ భార్య ప్రాధేయపడగా, సేఫ్టీ డ్రస్, అంబులెన్స్ ఏర్పాటు చేసిన అధికారులు, భర్త వద్దకు అనుమతించారు. కరోనా వ్యాప్తి భయంతో తల్లిని, భార్యను బిడ్డ వద్దకు వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో గ్రామస్థుల ఓదార్పే బాలుడికి ధైర్యమైంది.

More Telugu News