Corona Virus: కోలుకుంటున్న భారత్... ఖాళీ అవుతున్న ఐసీయూ పడకలు!

  • దేశవ్యాప్తంగా 1.50 లక్షల ఐసీయూ పడకలు
  • ఇంతవరకూ వాడింది 1.5 శాతమే
  • అత్యధికులకు అవసరపడని ఐసీయూ బెడ్స్
  • లాక్ డౌన్ మినహాయింపుల తరువాత కేసుల పెరుగుదలపై కేంద్రం కన్ను
ICU Beds for Corona Patients in India Vacent

కరోనా మహమ్మారి బారి నుంచి ఇండియా శరవేగంగా కోలుకుంటోంది. వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉన్నా సమర్థవంతంగా ఎదుర్కోవాలన్న ఆలోచనతో, వివిధ నగరాల్లోని ఆసుపత్రుల్లో 1.50 లక్షల ఐసీయూ పడకలను సిద్ధం చేయగా, వాటిలో ఇంతవరకూ వాడింది కేవలం 1.5 శాతమే. కరోనా నెగటివ్ వచ్చిన వారంతా త్వరగా కోలుకుంటుండటం, అత్యధికులకు ఐసీయూ బెడ్స్ అవసరం రాకపోవడమే ఇందుకు కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కొవిడ్-19 ఆసుపత్రుల్లో చాలా పడకలు ఖాళీగానే ఉన్నాయని, ఆసుపత్రుల్లో రద్దీ కూడా లేదని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కేవలం 2 వేల వరకూ ఐసీయూ పడకలను మాత్రమే ఇంతవరకూ వినియోగించామని తెలిపారు. ఇదిలావుండగా, లాక్ డౌన్ 3.0 సందర్భంలో పలు రకాల మినహాయింపులు ఇవ్వగా, దాని ప్రభావం కేసుల సంఖ్యపై ఏ మేరకు ఉంటుందన్న విషయం మరికొద్ది రోజుల్లో వెల్లడవుతుంది. కేసులు ఎంత వేగంతో పెరుగుతాయన్న విషయమై ఓ అంచనాకు రావాలని కేంద్రం భావిస్తోంది.

కరోనా పాజిటివ్ కేసుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1.30 లక్షల పడకలు, మెట్రో నగరాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో మరో 15 వేల పడకల వరకూ సిద్ధంగా ఉన్నాయి. 99 వేల పడకలకు ఆక్సిజన్ ఏర్పాటు సౌకర్యం అందుబాటులో ఉంది. ఎవరైనా రోగి శరీరంలో కరోనా తీవ్రమైతే, దేశవ్యాప్తంగా 970 ఆసుపత్రుల్లో అన్ని రకాల వసతులతో చికిత్సను అందించే వీలుందని అధికారులు అంటున్నారు.

కాగా, ఈ ఉదయానికి ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 62 వేలను దాటగా, 41 వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. 19,300 మందికిపైగా చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. 2,101 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్యలో 30 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 20 వేలను దాటగా, ఆ తరువాతి స్థానంలో గుజరాత్ 7,800 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో 6,500కు పైగా కేసుల చొప్పున నమోదయ్యాయి.

More Telugu News