CBSE: కరోనా ఎఫెక్ట్: ఇంటి వద్దే సీబీఎస్ఈ పరీక్ష పేపర్ల మూల్యాంకనం

  • రేపటి నుంచే మూల్యాంకనం
  • 50 రోజుల్లో పూర్తి
  • సీబీఎస్ఈ ఫలితాల వెల్లడిలో జాప్యం ఉండబోదన్న కేంద్రం
CBSE Board Exam papers evaluation at home starts tomorrow

కరోనా మహమ్మారి దెబ్బకు సామాజిక జీవనం కుదేలైంది. దేశంలో విద్యావ్యవస్థ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. విద్యార్థులు ఇంటికే పరిమితం కాగా కొన్ని విద్యాసంస్థలు ఆన్ లైన్ లో బోధన కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ పరీక్ష పేపర్ల మూల్యాంకనం ఇంటి వద్దే నిర్వహిస్తారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. రేపటి నుంచే సీబీఎస్ఈ పరీక్ష పేపర్ల మూల్యాంకనం షురూ అవుతుందని, బోర్డు ఎగ్జామినర్లు ఇంటి నుంచే పరీక్ష పేపర్ల మూల్యాంకనం నిర్వహిస్తారని పోఖ్రియాల్ ట్విట్టర్ లో వెల్లడించారు.

3000 పరీక్ష కేంద్రాల నుంచి వచ్చిన 1.5 కోట్ల సీబీఎస్ఈ పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉందని తెలిపారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనం పూర్తయ్యాక, అధికారులు ఎగ్జామినర్ల ఇళ్లకు వెళ్లి పరీక్ష పత్రాలను సేకరించి, వాటిని తిరిగి పరీక్ష కేంద్రాలకు తరలిస్తారని వివరించారు. ఈ ప్రక్రియ మొత్తం 50 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించామని, 2020 సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్ ఫలితాలు ఆలస్యం అయ్యే పరిస్థితి ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు ఇంటి వద్దే సీబీఎస్ఈ పరీక్ష పేపర్ల మూల్యాంకనానికి అనుమతించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News