Kannababu: గాలిలో విషవాయువు ప్రభావం వేగంగా తగ్గిపోతోంది: మంత్రి కన్నబాబు

  • మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి
  • వైజాగ్ ప్రమాదంపై కమిటీలు
  • కమిటీ సభ్యుల పేర్లు వెల్లడి
Kannababu says toxic value in air has been reducing gradually

వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విషవాయు ప్రభావంతో వైజాగ్ శివారు ప్రాంతం ఆర్ఆర్ వెంకటాపురం పరిసరాల్లో 12 మంది మృత్యువాత పడగా, వందల మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల మంత్రి కన్నబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

గాలిలో విషవాయువు ప్రభావం వేగంగా తగ్గిపోతోందని చెప్పారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయానికి ఎల్జీ పాలిమర్స్ ఇండస్ట్రీ మెయిన్ గేటు వద్ద 0.3 శాతం, గోపాలపట్నం, పెందుర్తి, వేపగుంటలో 0 శాతం, వెంకటాద్రినగర్ లో 0.3 శాతం, స్టోరేజి ట్యాంకు వద్ద 1.9 శాతం ఉందని తెలిపారు. విష వాయువు ప్రభావం తగ్గిపోతోందని దీన్నిబట్టే సులభంగా అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. రేపు సాయంత్రం వరకు ప్రభావిత ప్రాంతాలకు 5 గ్రామాల ప్రజలను వెళ్లవద్దని సూచించామని, రేపు సాయంత్రం మరోసారి వాతావరణంలో విషవాయువు పరిమాణం గణన చేసి ఆపై నిర్ణయం తీసుకుంటామని కన్నబాబు వెల్లడించారు.

కాగా, ఈ ఘటనపై అధ్యయనం కోసం కేంద్రం నియమించిన కమిటీ ఈ సాయంత్రం వైజాగ్ చేరుకుందని వివరించారు. ఫ్యాక్టరీ లోపలి పరిణామాల పరిశీలన కోసం ఓ కమిటీ నియమించామని, అది కాకుండా శాస్త్రీయ అధ్యయనం కోసం ఆంధ్రా యూనివర్శిటీకి చెందిన నలుగురు నిపుణులతో మరో కమిటీ వేశామని చెప్పారు. ఇందులో ప్రొఫెసర్ బాలప్రసాద్ (సివిల్ ఇంజినీరింగ్), ప్రొఫెసర్ ఎస్వీ నాయుడు (కెమికల్ ఇంజినీరింగ్), ప్రొఫెసర్ బాబూరావు (మెటలర్జికల్ ఇంజినీరింగ్), రిటైర్డ్ ఫ్రొఫెసర్ ఓ భానుకుమార్ (మెటియరాలాజికల్ మరియు ఓషనోగ్రఫీ) ఈ కమిటీలో ఉన్నారని వివరించారు. అంతేగాకుండా, తిరుపతిలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) నిపుణులను కూడా ఈ ఘటనపై విశ్లేషణకు ఆహ్వానించామని చెప్పారు.

ఈ విషవాయువు లీక్ ఘటన కారణంగా మొత్తం 585 మంది వివిధ ఆసుపత్రుల్లో చేరారని, వారిలో 418 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరినవారిలో 111 మంది డిశ్చార్జి అయ్యారని వివరించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఎంతఖర్చైనా సరే భరించి సకల వైద్య సౌకర్యాలు అందేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారని వెల్లడించారు.

More Telugu News