Rohit Sharma: ధావన్ ను 'ఇడియట్' అని పేర్కొన్న రోహిత్ శర్మ

Rohit Sharma terms his opening partner Dhawan an idiot
  • విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా రోహిత్, ధావన్ కు గుర్తింపు
  • తొలినాళ్లలో ధావన్ వైఖరి వివరించిన రోహిత్
  • వార్నర్ తో వీడియో చాట్
భారత క్రికెట్ చరిత్రలో విజయవంతమైన ఓపెనింగ్ జోడీల్లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ కూడా ఉంటారు. వీరిద్దరూ కలిసి వన్డేల్లో 107 పర్యాయాలు ఓపెనింగ్ కు దిగి 4802 పరుగులు జోడించారు. అయితే, తొలినాళ్లలో తామిద్దరి మధ్య సమన్వయం చాలా తక్కువగా ఉండేదని, కాలక్రమంలో తమ జోడీ విజయవంతం అయిందని రోహిత్ శర్మ వెల్లడించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ తో ఓ వీడియో చిట్ చాట్ లో రోహిత్ ఈ వివరాలు తెలిపాడు.

వార్నర్, ధావన్ కలిసి హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తరఫున ఓపెనింగ్ చేసేవాళ్లన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వార్నర్ మాట్లాడుతూ, ఎప్పుడైనా ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ఎదుర్కోమని ధావన్ అడిగాడా? అని రోహిత్ ను ప్రశ్నించాడు. అందుకు రోహిత్ బదులిస్తూ, ధావన్ ఓ ఇడియట్ అని అన్నాడు. ఎందుకలా అనాల్సి వచ్చిందో వివరించాడు.

"2013లో నాకు టీమిండియా ఓపెనర్ గా ప్రమోషన్ వచ్చింది. అది చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్. ధావన్ తో కలిసి బరిలో దిగాను. ప్రత్యర్థి జట్టు దక్షిణాఫ్రికా. మోర్నీ మోర్కెల్, డేల్ స్టెయిన్ వంటి హేమాహేమీలున్నారు. దాంతో తొలి బంతిని ఎదుర్కోవడానికి భయపడ్డాను. అందుకే ధావన్ ను మొదటి ఓవర్ ఆడాలని కోరాను. ఓపెనర్ గా ఇది నాకు ఫస్ట్ ఓవర్, నువ్వు ఎప్పటినుంచో ఓపెనర్ గా ఆడుతున్నావు కదా, ఆట నువ్వు స్టార్ట్ చేయి అని చెప్పాను. కానీ అతను వెంటనే నో చెప్పాడు. దాంతో చేసేదిలేక నేను ఫస్ట్ ఓవర్ ఆడాను. మోర్నీ మోర్కెల్ వేసిన కొన్ని బంతులు కంటికి కనిపించలేదు. ఆ ఇంగ్లాండ్ పిచ్ పై బౌన్స్ ను అస్సలు ఊహించలేకపోయాను" అంటూ వివరించాడు. రోహిత్ చెబుతున్నంత సేపు వార్నర్ పగలబడి నవ్వుతూనే ఉన్నాడు.

తొలినాళ్లలో కాస్తంత సమన్వయ లోపం ఉన్నా, ఆ తర్వాత కాలంలో తాము ఒకరికోసం ఒకరం అన్నట్టుగా తయారయ్యామని రోహిత్ వెల్లడించాడు. అంతేకాకుండా, బ్యాటింగ్ చేసేటప్పుడు మధ్యలో గేమ్ ప్లాన్ గురించి చర్చించుకున్నాక, ఆ... ఏంటి చెప్పావు? అని అంటాడని, దాంతో తీవ్ర అసహనం కలిగేదని వివరించాడు. తను బంతిని డిఫెన్స్ ఆడాక రెండు అడుగులు ముందుకేసేవాడని, నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న తాను అది పరుగు తీసే ప్రయత్నమో, మరేంటో అర్థంకాక గందరగోళానికి గురైన సందర్భాలు ఉన్నాయని రోహిత్ తన సహచరుడు ధావన్ గురించి తెలిపాడు.
Rohit Sharma
Dhawan
David Warner
Opening
India

More Telugu News