Chandrababu: టీవీ5పై దాడిని ఖండించిన చంద్రబాబు, కన్నా, సోమిరెడ్డి, సీఎం రమేశ్

  • టీవీ 5 కార్యాలయంపై గత రాత్రి రాళ్లదాడి
  • పిరికిపందల చర్యలన్న చంద్రబాబు
  • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్న సోమిరెడ్డి
  • విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న కన్నా
chandrababu on tv5 incident

హైదరాబాద్‌లోని టీవీ5 ఆఫీసుపై గత అర్ధరాత్రి కొందరు రాళ్ల దాడి చేయడాన్ని పలువురు నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. 'గత రాత్రి టీవీ 5 ఆఫీసుపై కొందరు పాల్పడ్డ ఈ పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ విధిని తాము సక్రమంగా నిర్వహిస్తున్నందుకే మీడియాపై ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు. వీలైనంత త్వరగా నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నాను' అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

'వాస్తవాలు వెలుగులోకి తెస్తోందని టీవీ5పై దాడి చేయడం దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. గతంలో మా ప్రభుత్వంపై సాక్షి మీడియా పచ్చి అబద్ధాలు రాసింది. ఓర్పుతో భరించాం తప్ప బరితెగించ లేదు. మీడియాను ఎదుర్కొనే ధైర్యం ప్రభుత్వం, పార్టీకి ఉండాలి. అందరూ సాక్షిలా మారాలనే ధోరణి తగదు' అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

'టీవీ 5 కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.. తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేసే మీడియా సంస్థలపై, వ్యక్తులపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి' అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.

'హైదరాబాద్ లోని టీవీ5 కార్యాలయంపై కొందరు దుండగులు జరిపిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే దుశ్చర్యకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను' అని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు.

More Telugu News