Jagan: విషవాయు పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించేలా చూడాలి: సీఎం జగన్ ఆదేశాలు

  • గ్యాస్ లీకేజ్ దుర్ఘటన అనంతర పరిణామాలపై జగన్ సమీక్ష
  • విశాఖలో విషవాయు పరిశ్రమలు ఎన్నో లెక్క తేల్చండి
  • అలాగే జనావాసాల మధ్య ఎన్ని ఉన్నాయో కూడా
CM Jagan Video Conference

విశాఖలో గ్యాస్ లీకేజ్ దుర్ఘటన అనంతర పరిణామాలు, సహాయక చర్యలు కొనసాగుతున్న తీరుపై ఏపీ సీఎం జగన్ సమీక్షించారు. విశాఖలో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వెళ్లిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. దుర్ఘటన జరిగిన చోట పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ నివారణా చర్యలను ఈ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ వినయ్ చంద్ వివరించారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, తగు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కాలుష్య నియంత్రణ మండలి క్రియాశీలకంగా ఉండాలని, కాలుష్య కారకాలపై ఫిర్యాదులు, వాటి నివారణకు పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఘటనా ప్రాంతంలో ఉన్న రసాయనాలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, లేకుంటే, ముడిపదార్థాలను పూర్తిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
 
విషవాయువులు ఉండే పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించేందుకు తగు ఆలోచనలు చేయాలని సూచించారు. విశాఖలో విషవాయువులు ఉన్న పరిశ్రమలు మొత్తం ఎన్ని ఉన్నాయనే దానితో పాటు, అలాంటి పరిశ్రమలు జనావాసాల మధ్య ఎన్ని ఉన్నాయన్న విషయాన్ని తేల్చాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

More Telugu News