ముంబై ఆసుపత్రిలో దారుణం.. కరోనా పేషెంట్ల పక్కనే శవాలు!

07-05-2020 Thu 19:30
  • సియాన్ ఆసుపత్రిలో కరోనా పేషెంట్ల పక్కనే ఏడు శవాలు
  • వీడియో పోస్ట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే
  • శవాల పక్కనే పేషెంట్లు నిద్రపోతున్నారని ట్వీట్

కరోనా పేషెంట్ల పక్కనే శవాలను ఉంచిన వీడియో జనాలను షాక్ కు గురి చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ముంబైలోని సియాన్ ఆసుపత్రిలో తీసింది. ఆసుపత్రిలోని ఓ వార్డులో కరోనా పేషెంట్ల పక్కనే శవాలు ఉన్న బ్యాగులను పడేశారు. సియాన్ ఆసుపత్రిని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ముంబైలో కరోనా కేసులను హ్యాండిల్ చేయడంలో ఈ ఆసుపత్రి ప్రధాన పాత్రను పోషిస్తోంది.

ట్రీట్మెంట్ తీసుకుంటున్న కరోనా పేషెంట్ల పక్కన కనీసం ఏడు మృతదేహాలు వీడియోలో కనిపిస్తున్నాయి. పేషెంట్లను చూసేందుకు వారి బంధువులు వస్తున్న సన్నివేశాలు కూడా వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోను మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే ట్విట్టర్ లో షేర్ చేశారు. 'సియాన్ ఆసుపత్రిలో మృతదేహాల పక్కనే కరోనా పేషెంట్లు నిద్రపోతున్నారు. ఇదెక్కడి అడ్మినిస్ట్రేషన్? సిగ్గుపడాల్సిన విషయం' అని ఆయన కామెంట్ చేశారు.