Visakhapatnam District: విశాఖ దుర్ఘటనలో ముగ్గురి మృతి.. డ్యూటీకి వెళ్తూ కుప్పకూలిన కానిస్టేబుల్

  • మృతుల్లో ఇద్దరు వృద్ధులు, ఎనిమిదేళ్ల బాలిక
  • 25 అంబులెన్సులు, పోలీసు వాహనాలతో బాధితుల తరలింపు
  • ఐదు కిలోమీటర్ల ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
Three dead in Visakha Gas leak

విశాఖపట్టణంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి కెమికల్ గ్యాస్ లీకైన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా 200 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. మృతుల్లో ఇద్దరు వృద్ధులు, ఎనిమిదేళ్ల బాలిక ఉన్నారు. ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో  పరిశ్రమ నుంచి లీకైన రసాయన వాయువు దాదాపు మూడు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించింది. దీనిని పీల్చిన వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ గాలి పీల్చిన కొందరు రోడ్డుపైనే పడిపోయారు.

లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో కంపెనీని తెరిచే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పరిశ్రమ నుంచి స్టెరైన్ అనే విష వాయువు లీకైనట్లు చెబుతున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు కంపెనీకి ఐదు కిలోమీటర్ల  పరిధిలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

25 అంబులెన్సులు, పోలీసు వాహనాలతో బాధితులను కేజీహెచ్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అలాగే, విధుల్లో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ఓ కానిస్టేబుల్ ఈ వాయువు పీల్చి రోడ్డుపైనే కుప్పకూలాడు. గుర్తించిన స్థానికులు అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను కేజీహెచ్‌కు తరలించారు.

More Telugu News