Narasaraopet: నరసరావుపేటలో ప్రత్యేక కార్యాచరణ.. ‘మిషన్ 15’

  • ‘కరోనా’ హాట్ స్పాట్ గా మారిన నరసరావుపేట
  • 15 రోజుల తర్వాత కొత్త కేసులు ఉండకూడదన్న లక్ష్యం 
  • ‘మిషన్ 15‘ పేరుతో కార్యాచరణ ప్రారంభం
MIssion 15 In Narasaraoptet

ఏపీలో కర్నూలు జిల్లా తర్వాత అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఉన్న జిల్లా గుంటూరు. గుంటూరులో ఇవాళ కొత్తగా మరో 12 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 362కు చేరింది. ‘కరోనా’ కేసులు ఎక్కువగా గుంటూరు సిటీ, నరసరావుపేటల నుంచే నమోదవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గుంటూరు సిటీలో 162 కేసులు, నరసరావుపేట లో 163 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇంకా, 500 కు పైగా నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.

ఇక గుంటూరు జిల్లాలోనే అత్యధిక కేసులు నమోదైన నరసరావుపేటలో ‘కరోనా’ నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నరసరావుపేటలో ‘మిషన్ 15’ పేరుతో కార్యాచరణ ప్రారంభించారు. పదిహేను రోజుల తర్వాత కొత్త కేసులు ఉండకూడదన్న లక్ష్యంతో ఈ  ప్రత్యేక చర్యలు ప్రారంభించినట్టు సమాచారం.

ముందుగా ప్రకటించినట్టు గుంటూరు జిల్లాలో ఈ నెల 17 వరకు లాక్ డౌన్ యథాతధంగా కొనసాగుతుందని, ఎలాంటి సడలింపులు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. ఈ జిల్లాలో 20 కంటైన్ మెంట్ జోన్లు ఉండగా, వాటిని 59 క్లస్టర్లుగా విభజించారు. ‘కరోనా’ కేసుల ఆధారంగా క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో ఎలాంటి కార్యకలాపాలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

కాగా, ‘కరోనా’ హాట్ స్పాట్ గా మారిన నరసరావుపేటలో రోజుకు 10 నుంచి 15 కొత్త కేసులు నమోదవుతున్నాయి. పాలు, నిత్యావసరాలను అధికారులు నేరుగా ఇళ్లకే సరఫరా చేస్తున్నారు. ఒరవకట్ట, రామిరెడ్డి పేట, ప్రకాష్ నగర్, శ్రీరాంపురం, ఏనుగుల బజారు, నిమ్మతోట.. తదితర ప్రాంతాలు రెడ్ జోన్ లో ఉన్నాయి.

More Telugu News