FHRAI: మద్యం నిల్వలు అమ్ముకునేందుకు అనుమతి కోరిన హోటళ్లు, రెస్టారెంట్ల ఫెడరేషన్!

  • లాక్ డౌన్ తో మూతపడ్డ హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, పబ్ లు
  • వందల కోట్ల రూపాయల విలువ చేసే మద్యం నిల్వలు
  • అవసరమైతే హోమ్ డెలివరీ కూడా చేస్తామన్న ఫెడరేషన్  
FHRAI writes a letter to Central Home ministry

దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ తో హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, పబ్ లు కూడా మూతపడ్డ విషయం తెలిసిందే. దీంతో, మద్యం విక్రయాలు లేకపోవడంతో వందల కోట్ల రూపాయల విలువ చేసే సరుకు నిల్వ ఉంది. ఇప్పుడు దానిని ఏం చేయాలనే ప్రశ్న వారిని వేధిస్తోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి చేస్తూ ది ఫెడరేషన్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ హెచ్ ఆర్ఏఐ) ఓ లేఖ రాసింది. ప్రభుత్వం అనుమతిస్తే తమ వద్ద ఉన్న మద్యం స్టాక్ ను అమ్ముకుంటామని కోరింది. లేని పక్షంలో ఉన్న స్టాక్ ను మద్యం తయారీ కంపెనీలు తీసుకుని వాటి బదులు కొత్త స్టాక్ ఇచ్చేలా ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరింది.

కాగా, ప్రస్తుతం ఉన్న నిబంధనలను కాస్త సవరించి, తమ విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకోవాలని హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, పబ్ ల యాజమాన్యాలు కోరుతున్నాయి. ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటిస్తూ తమ వద్ద మద్యాన్ని విక్రయిస్తామని, అనుమతిస్తే అవసరమైన వారికి మద్యం హోం డెలివరీ చేసేందుకూ సిద్ధమేనని అంటున్నాయి.

More Telugu News