Telangana: తెలంగాణలో తెల్లవారుజామునుంచే రంగంలోకి దిగిన మద్యం వ్యాపారులు!

  • షాపుల వద్ద భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు
  • మార్కింగ్ లైన్స్, రౌండ్స్ గీయిస్తున్న యజమానులు
  • ఇప్పటికే షాపుల వద్ద మొదలైన సందడి
Liquor Shop Owners busy in Telangana

దాదాపు 50 రోజుల తరువాత నేడు తెలంగాణలో మద్యం దుకాణాలు తెరచుకోనుండటంతో, ఈ తెల్లవారుజామునే మద్యం వ్యాపారులు రంగంలోకి దిగారు. లాక్ డౌన్ నిబంధనలు, ప్రభుత్వ ఆంక్షలకు అనుగుణంగా షాపుల వద్ద చర్యలు ప్రారంభించారు. మార్కింగ్ లైన్స్, రౌండ్స్ గీస్తూ, కస్టమర్లు భౌతిక దూరాన్ని పాటించే ఏర్పాట్లు చేస్తున్నారు.

మద్యం కొనుగోలుకు వచ్చే వారంతా ఓ క్రమపద్ధతిలో నిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే వైన్స్ షాపుల యజమానులకు సూచనలు జారీ చేశామని అన్నారు. ఇక ఉదయం 10 గంటలకు షాపులు తెరచుకోనుండగా, ఉదయం 9 గంటల నుంచే మందుబాబుల సందడి మొదలైంది. పలు దుకాణాల వద్ద కస్టమర్లు పడిగాపులు కాస్తున్నారు.

కొనుగోలుదారులంతా మాస్క్ లను తప్పనిసరిగా ధరించాలని పేర్కొంటూ రూపొందించిన ప్లెక్సీలను మద్యం షాపుల వద్ద ప్రదర్శిస్తున్నారు. దీంతో షాపుల పక్కనే మాస్క్ లను విక్రయించే షాప్ లు కూడా వెలవడం గమనార్హం. షాపుల రీ ఓపెనింగ్ సందర్భంగా ఇతర ప్రాంతాల్లో జరిగిన అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడటమే తమ లక్ష్యమని అధికారులు అంటున్నారు.

More Telugu News