Petrol: ఒకేసారి.. పెట్రోల్ పై రూ. 10, డీజిల్ పై రూ. 13 సుంకాలు పెంచిన కేంద్రం!

  • ఇంటర్నేషనల్ మార్కెట్లో పతనమైన క్రూడాయిల్ ధర
  • అయినా కేంద్రం కొత్త పన్నులు
  • అదనపు భారాన్ని మోపడం లేదని వివరణ
Heavy Hike in Petrol and Diesel Price

లాక్ డౌన్ నిబంధనల కారణంగా ఇప్పటికే ఆర్థిక వృద్ధి పడిపోయి, నానా ఇబ్బందులూ పడుతున్న ప్రజలపై కేంద్రం మరో భారాన్ని మోపింది. పెట్రోలు, డీజిల్ ధరలను రికార్డు స్థాయిలో పెంచింది. లీటరు పెట్రోలుపై రూ. 10, లీటరు డీజిల్ పై రూ. 13 మేరకు ఎక్సైజ్ సుంకాలను పెంచింది. ఈ మేరకు నిన్న సాయంత్రం కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా దిగిరాగా, ఆ మేరకు ఇండియాలోనూ పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గుతూ వచ్చాయి. ఇక, ఈ తగ్గిన ధరల మేరకు పన్నులను పెంచడం ద్వారా ఖజానాకు కోత పడకుండా చూసుకోవాలన్న ఆలోచనలో ఉన్న కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

పెరిగిన సుంకాలతో ప్రజలపై ఎటువంటి అదనపు భారమూ పడబోదని ఈ సందర్భంగా అధికారులు వ్యాఖ్యానించారు. ఇటీవల ధరలు భారీగా తగ్గాయని గుర్తు చేశారు. కాగా, తాజా ధరల పెంపు పెట్రోలుపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకంగా రూ. 2, రోడ్ సెస్ రూ. 8గా ఉంటుందని, డీజిల్ విషయంలో ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకంగా రూ. 5, రోడ్ సెస్ రూ. 8గా ఉంటుందని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయంతో సుంకాలు పెట్రోలుపై రూ. 32.98, డీజిల్ పై రూ. 31.83కు పెరిగాయి.

2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో పెట్రోలుపై రూ. 9.48, డీజిల్ పై రూ. 3.56 మేరకు పన్నులు ఉండేవి. ఆపై ఎన్డీయే సర్కారు వరుసగా పన్నులను పెంచుకుంటూ వచ్చింది. గడచిన మార్చిలో సైతం పెట్రో ఉత్పత్తులపై రూ. 3 శాతం సుంకాన్ని విధించింది.

More Telugu News