Nani: 'జగదేక వీరుడు - అతిలోక సుందరి' వెనకున్న కథపై హీరో నాని తొలి వాయిస్ ఓవర్ వీడియో!

Hero Nani Voice over on Jagadeka Veerudu Atiloka Sundari
  • 1990 మే 9న విడుదలైన చిత్రం
  • సినిమా విడుదలై 30 ఏళ్లు
  • స్టోరీ వెనుక స్టోరీ చెబుతున్న నాని 
1990 మే 9న... అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం చిరంజీవి, శ్రీదేవి జంటగా వచ్చిన  'జగదేక వీరుడు - అతిలోక సుందరి' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత సందడి చేసిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఆ దశకంలో వచ్చిన టాప్ హిట్ కూడా ఇదేననడంలో సందేహం లేదు. అశ్వనీదత్ నిర్మాతగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రం వచ్చి, 30 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, హీరో నాని వాయిస్ ఓవర్ తో ఈ సినిమా వెనకున్న కథను చెప్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలి పార్ట్ విడుదలైంది. ఈ సినిమా గురించి నాని మాటల్లోనే...

"బ్లాక్ బస్టర్లు ఎన్నో వస్తాయి. కానీ, జనరేషన్లు మారినా, ఎవర్ గ్రీన్ గా ఉండే బ్లాక్ బస్టర్ల లిస్ట్  లో ఫస్ట్ ఉండే సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. సినిమా తీసే, సినిమా చూసే విధానాన్ని మార్చిన ఈ చిత్రం ఎలా పుట్టింది? అశ్వినీదత్ గారికి ఏనాటి నుంచో ఎన్టీఆర్ 'జగదేక వీరుని కథ' లాంటి ఫాంటసీ సినిమా చిరంజీవిగారితో చేయాలని, అది తను ప్రేమగా 'బావ' అని పిలుచుకునే రాఘవేంద్రరావుగారు మాత్రమే తీయగలరని గట్టి నమ్మకం ఉండేదట.

'ఆఖరి పోరాటం' తరువాత చిరంజీవిగారితో సినిమా చేయాలనుకున్నారు దత్తుగారు. ఆయనకు క్లోజ్ ఫ్రెండ్, కో-డైరెక్టర్ అయిన శ్రీనివాస్ చక్రవర్తిని, రాఘవేంద్రరావుతో కలిపి తిరుపతికి పంపారు. సరిగ్గా తిరుమల కొండపై ఉండగా, దత్తుగారి మనసు తెలిసిన శ్రీనివాస చక్రవర్తి, "దేవకన్య భూమిపైకి వచ్చినప్పుడు ఆమె ఉంగరం పోతుంది. అది చిరంజీవిగారికి దొరుకుతుంది" అని ఊహామాత్రంగా చెప్పారు. అది రాఘవేంద్రరావుగారికి బాగా నచ్చింది. దత్తుగారి కలకు దగ్గరగా ఉంది. ఆయనకీ నచ్చింది. మరి జగదేకవీరుడికి అతిలోక సుందరిగా జోడీ ఎవరు? అందరి మదిలో మెదిలిన పేరు ఒక్కటే. వైజయంతీ ఆస్థాన నాయిక వెండితెర దేవత శ్రీదేవి. క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది.

దానికి తగిన కథను సిద్ధం చేయటానికి వైజయంతీ ఆఫీస్ లో రచయితల కుంభమేళా ప్రారంభమైంది. యండమూరి వీరేంద్రనాథ్ గారు, జంధ్యాలగారితో మొదలై, సత్యమూర్తిగారు, విజయేంద్ర ప్రసాద్ గారు, తమిళ రచయిత క్రేజీ మోహన్ గారు.. ఇలా ఇంతమంది రచయితల సైన్యం సిద్ధమైంది. అంతేకాదు, చిరంజీవిగారు కూడా నెలరోజుల పాటు అక్కడకు వెళ్లి కథా చర్చల్లో పాల్గొని తన సలహాలు కూడా ఇచ్చేవారు. దేవకన్యను అతిలోక సుందరిగా చూపిస్తున్నప్పుడు నేను కొంచెం మాసిన గడ్డంతో సామాన్య మానవుడి లుక్ లో ఉంటేనే బాగుంటుంది. అందరూ కనెక్ట్ అవుతారు అని చిరంజీవిగారు సలహా ఇచ్చారు.

మరోవైపు బాంబేలో తన కాస్ట్యూమ్స్ తానే కుట్టించుకోవడం మొదలు పెట్టారు శ్రీదేవిగారు. ఇలా అందరూ కలిసి తమ సమష్టి కృషితో ఈ అందమైన చందమామ కథను తెలుగు సినీ చరిత్రలో మర్చిపోలేని అద్భుత చిత్ర కావ్యంగా మలిచారు. చరిత్రను సృష్టించిన ఈ సినిమా అంత ఈజీగా అయిపోయిందనుకుంటున్నారా? లేదు మానవా! చాలా జరిగింది" అని నాని తెలిపాడు. ఇక ఈ స్టోరీ వెనకున్న స్టోరీ రెండో భాగం 7వ తేదీన సినీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Nani
Chiranjeevi
Sridevi
Jagadeka Veerudu - Atiloka Sundari
Voice Over

More Telugu News