Honey Suckle: జపాన్ లో దొరికే వనమూలికపై పరిశోధకుల ఆసక్తి... కరోనాపై పనిచేస్తుందన్న ఆశ!

  • జర్మనీలో సూపర్ కంప్యూటర్ సాయంతో విశ్లేషణలు
  • హనీ సకిల్ అనే మూలిక కరోనాపై పనిచేయొచ్చంటున్న పరిశోధకులు
  • ఆసియాలో ప్రాచీనకాలం నుంచి హనీ సకిల్ వినియోగం
German researchers finds Japanese plant to fight against corona

కరోనా వైరస్ ను సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ లపై ఇప్పటికే ముమ్మరంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. మరోవైపు, ఈ వైరస్ ను నిర్మూలించే ఔషధాల కోసం సూపర్ కంప్యూటర్లను కూడా రంగంలోకి దించారు. మోగాన్-2 సూపర్ కంప్యూటర్ ఉపయోగించి కరోనా వైరస్ తో మాలిక్యులర్ డాకింగ్ ప్రక్రియ చేపట్టిన జర్మనీ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

కరోనా వైరస్ తో కలిగే ప్రతి చిన్న లక్షణంతో సహా మొత్తం లక్షణాలను సూపర్ కంప్యూటర్ కు ఫీడ్ చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔషధాలలో ఏవి ఆ లక్షణాలను తగ్గించగలవని కంప్యూటర్ సాయంతో విశ్లేషించారు. అంతేకాదు, కరోనా వైరస్ క్రిమిలోని ప్రొటీన్ల జన్యుక్రమంపై ప్రభావం చూపగల 42,000 పదార్థాలను కృత్రిమంగా పరిశీలించారు. రెండు నెలల వ్యవధిలో 3 వేల కోట్ల సమీకరణాలు చేపట్టి చివరికి కొన్ని ఔషధాలు, మూలికలు కరోనాపై గణనీయంగా ప్రభావం చూపుతాయని గుర్తించారు. జపాన్ లో లభ్యమయ్యే హనీ సకిల్ అనే వనమూలిక కరోనా వైరస్ ను ఎదుర్కొనే ఔషధ లక్షణాలు కలిగివుందని తెలుసుకున్నారు.

హనీ సకిల్ ను శాస్త్రీయ పరిభాషలో లోనిసెరా జపోనికా అంటారు. ఆసియా ప్రాంతంలో  దీన్ని ప్రాచీనకాలం నుంచి అనేక రకాల జబ్బులకు ఔషధంగా వాడుతున్నారు. ఈ వనమూలికపై శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేపట్టి, కరోనాపై పనిచేస్తుందా లేదా అన్నది తేల్చాలని సూపర్ కంప్యూటర్ సిమ్యులేషన్ లో పాలుపంచుకున్న జోహానెస్ గుటెన్ బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు కోరుతున్నారు.

ఇక, హెపటైటిస్-సి చికిత్సలో ఉపయోగించే గ్రజోప్రవిర్, సిమిప్రవిర్, వెల్పటాస్విర్, పరిటాప్రవిర్ అనే ఔషధాలు కూడా కరోనా వైరస్ పై పనిచేస్తాయని సిమ్యూలేషన్ లో గుర్తించారు. ఈ ఔషధాల్లో ఉన్న పదార్థాలు కరోనా వైరస్ పునరుత్పత్తిని అడ్డుకుంటాయనిపిస్తోందని జర్మనీ పరిశోధకులు వెల్లడించారు.

More Telugu News