Tenali: మందుబాబులకు కొత్త రూల్స్ పెట్టిన తెనాలి సీఐ!

  • లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు మూతపడిన మద్యం దుకాణాలు
  • సడలింపులతో మళ్లీ తెరుచుకున్న వైనం
  • మద్యం దుకాణాల ముందు బారులు తీరిన ప్రజలు
  • భౌతికదూరం పాటించకపోవడంతో విమర్శలు
Tenali CI implements new conditions for alcoholics

లాక్ డౌన్ నిబంధనల కారణంగా సుదీర్ఘ విరామం అనంతరం మద్యం షాపులు తెరుచుకోవడంతో దేశవ్యాప్తంగా కోలాహలం నెలకొంది. ఏ మద్యం దుకాణం ముందు చూసినా బారులు తీరిన మందుబాబులే కనిపించారు. ఏపీలోనూ ఇదే పరిస్థితి దర్శనమిచ్చింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా మద్యం ప్రియులు దుకాణాల ముందు ఓపిగ్గా ఎదురుచూశారు. అయితే, వారు భౌతికదూరం పాటించకపోవడం తీవ్ర విమర్శలపాలైంది. ఈ నేపథ్యంలో, తెనాలి సీఐ హరికృష్ణ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. ఆధార్ కార్డు, గొడుగు ఉంటేనే మద్యం అని స్పష్టం చేశారు.

గొడుగు ఉండడం వల్ల కచ్చితంగా ఒకరి నుంచి మరొకరు ఎడంగా ఉంటారని, దానికి తోడు ఎండ బారి నుంచి రక్షణ కూడా కలుగుతుందని తెలిపారు. ఇక, ఇతర ప్రాంతాల నుంచి కూడా మద్యం కోసం వస్తుండడంతో విపరీతమైన రద్దీ ఏర్పడుతున్న దరిమిలా స్థానికులు, స్థానికేతరులను గుర్తించేందుకు ఆధార్ కార్డు నిబంధన తీసుకువచ్చామని సీఐ వెల్లడించారు. లాక్ డౌన్ ముగిసేవరకు ఇవే నిబంధనలు ఉంటాయని స్పష్టం చేశారు.

More Telugu News