Elon Musk: సహజీవనం చేస్తున్న గర్ల్ ఫ్రెండ్ తో కలిసి బిడ్డను కన్న ఎలాన్ మస్క్!

Elon Musk Welcomes First Child With Girlfriend
  • 2018 నుంచి గ్రిమీస్ తో డేటింగ్ చేస్తున్న మస్క్
  • బిడ్డ పుట్టినట్టు ఈ తెల్లవారుజామున ట్వీట్
  • శుభాకాంక్షలు తెలిపిన పలువురు
గత కొన్నేళ్లుగా తాను సహజీవనం చేస్తున్న గర్ల్ ఫ్రెండ్ తో కలిసి స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్, తొలి సంతానాన్ని పొందారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 48 సంవత్సరాల ఎలాన్ మస్క్, 2018 నుంచి సంగీత కళాకారిణి గ్రిమీస్ తో డేటింగ్ లో ఉన్నారు. గ్రిమీస్ గర్భం దాల్చిందని గతంలోనే వార్తలు వెలువడగా, బిడ్డ జననంపై అప్ డేట్ ఇవ్వాలని పలువురు ట్విట్టర్ లో కోరడంతో మస్క్ స్పందించారు. నిన్న సోమవారం నాడు 'మరికొన్ని గంటల్లో...' అని మొదట, ఆపై 'తల్లీ, బిడ్డా క్షేమమే' అని ఈ తెల్లవారుజామున ట్వీట్లు చేశారు. బిడ్డ గురించి అంతకుమించిన సమాచారాన్ని ఆయన వెల్లడించలేదు.

ఈ బిడ్డ గ్రిమీస్ కు తొలి బిడ్డ కాగా, మస్క్ కు ఇప్పటికే ఐదుగురు సంతానం ఉన్నారు. ఆయన తన జీవితంలో మూడుసార్లు విడాకులు పొందారు. అందులో రెండుసార్లు ఒకే యువతి నుంచి పొందడం గమనార్హం. గ్రిమీస్ అసలు పేరు క్లారీ బౌచర్. తానిప్పుడు గర్భంతో ఉన్నానని గత జనవరిలో ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడిస్తూ, ఓ టాప్ లెస్ ఫోటోను ఆమె విడుదల చేయగా, అది వైరల్ అయింది. అంతకుముందు 2018లో జరిగిన 'మెట్ గాలా' కార్యక్రమంలో వీరిద్దరూ తొలిసారిగా కనిపించారు. ఇక తాజాగా మస్క్ మరోసారి తండ్రి కావడంపై పలువురు శుభాభినందనలు తెలుపుతున్నారు.
Elon Musk
Grimees
Child
Born
Twitter

More Telugu News