Nitish Kumar: విమర్శలతో నితీశ్ కుమార్ వెనకడుగు.. వారికి కూడా రైలు టికెట్ డబ్బు వెనక్కిస్తామని వ్యాఖ్య!

Nitish Kumar Says Train Fares To Be Reimbursed
  • కార్మికుల ఖర్చులను చెల్లిస్తామన్న తేజశ్వి యాదవ్
  • ఎంత ఖర్చో చెపితే చెక్ పంపిస్తామని వ్యాఖ్య
  • కార్మికులకు రూ. 500 కూడా ఇస్తామన్న నితీశ్
ఇతర రాష్ట్రాల నుంచి బీహార్ కు తిరిగి వస్తున్న కార్మికులు, కూలీలకు రైలు టికెట్ ఖర్చులను చెల్లిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. ఇంటికి తిరిగి వచ్చిన వారి జేబులు ఖాళీగా లేకుండా... ఇతర అవసరాల కోసం రూ. 500 కూడా ఇస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు ఉచితంగా తిరిగి వచ్చేలా ఇంతకు ముందు నిర్ణయం తీసుకున్నామని... ఇప్పుడు వలస కార్మికులకు కూడా ఆ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు.

కార్మికులను పట్టించుకోవడం లేదంటూ ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ తో పాటు, మిత్రపక్షమైన బీజేపీ కూడా విమర్శలు గుప్పించడంతో నితీశ్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. సాయాన్ని కార్మికులకు కూడా అందించాలని నిర్ణయించింది.

అంతకు ముందు తేజశ్వి మాట్లాడుతూ, 50 రైళ్లలో బీహార్ కు చేరుకున్న కార్మికుల ఖర్చులను తాము చెల్లిస్తామని... ఎందుకంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆ పని చేయలేకపోతోందని ఎద్దేవా చేశారు. బిల్లు ఎంతో చెప్పాలని, వెంటనే చెక్ పంపిస్తామని డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ (బీజేపీ)ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీపై కూడా ఒత్తిడి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు కూడా సాయం చేయనున్నట్టు ప్రకటించింది.
Nitish Kumar
JDU
Tejashwi
RJD

More Telugu News