Chandrababu: మద్యం దుకాణాలు తెరిచి ప్రజల రక్తం పిండుకోవడం దారుణం: చంద్రబాబు

  • పార్టీ నేతలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం
  • రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవడంపై అసంతృప్తి
  • మద్యం దుకాణాల వద్ద గుంపులతో కరోనా వ్యాపిస్తుందని వ్యాఖ్యలు
  • ప్రభుత్వానిదే బాధ్యత అంటూ హెచ్చరిక
Chandrababu fires on AP Government

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ సీనియర్ నేతలతో ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు. కరోనా యోధులపై పూలు చల్లిన సాయుధ దళాలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవడంపై ఘాటుగా స్పందించారు. మద్యం దుకాణాలు తెరిచి ప్రజల రక్తం పిండుకోవడం దారుణమని అన్నారు. మద్యం దుకాణాల వద్ద గుంపులతో కరోనా పెరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. మద్యంపై ఆదాయం ముఖ్యమా? ప్రజల ఆరోగ్యం ముఖ్యమా? అని ప్రశ్నించారు.

మద్య నిషేధానికి ఇంతకంటే మంచి సమయం ఏముంటుందని అన్నారు. ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడడం అమానుషం అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జే-ట్యాక్స్ కోసమే మద్యం ఉత్పత్తికి అనుమతి ఇచ్చారని ఆరోపించారు. అంతేకాదు, రైతుల అంశంలోనూ స్పందించారు. సీఎం, మంత్రుల ప్రకటనలే తప్ప రైతులను ఆదుకుంది శూన్యమని విమర్శించారు. పదోవంతు పంటలు కొనలేదని చెప్పేందుకు కోర్టులో అఫిడవిట్టే సాక్ష్యమని పేర్కొన్నారు. మద్దతు ధర కోసం రైతులు కోర్టుకెళ్లడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు.

అటు, ఇళ్ల స్థలాల భూసేకరణలోనూ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు. భూములు మెరక చేయడం పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో భూసేకరణే దోపిడీకి ఉదాహరణ అని చంద్రబాబు వెల్లడించారు. గోదావరి ముంపు ప్రాంతం ఆవ భూముల్లోనూ పెద్ద కుంభకోణం చేశారని తెలిపారు. ఎకరం రూ.7 లక్షలు చేసే భూమిని రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షలకు కొన్నారని వివరించారు. మడ అడవులను కొట్టేసి మెరక చేయడంలోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాలకు భూసేకరణ వైసీపీ నేతలకు ఆదాయ వనరుగా మారిందని, వాస్తవ ధరకు 6 రెట్లు ఎక్కువగా కొని వాటాలు పంచుకుంటున్నారని వెల్లడించారు.

More Telugu News