KTR: తప్పదు.. వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనాతో కలిసి జీవించాల్సిందే!: కేటీఆర్

  • వ్యాక్సిన్ కనుక్కునేంత వరకు కరోనాతో బతకాల్సిందే
  • పూర్వ పరిస్థితికి చేరడానికి చాలా కష్టపడాలి
  • రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయం అందించాలి
We have to live with corona says KTR

కరోనాతో కలిసి జీవించడాన్ని ప్రజలంతా నేర్చుకోవాలని... ఈ మహమ్మారికి ఔషధం లేదా వ్యాక్సిన్ కనుక్కునేంత వరకు ఇది తప్పదని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వైరస్ కు వ్యాక్సిన్ లేదనేది అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న రేటు... వైరస్ సోకుతున్న రేటు కంటే తక్కువగా ఉందని తెలిపారు. వ్యాధిని నివారించిన తర్వాత... పూర్వ పరిస్థితులకు చేరుకునేందుకు పెద్ద ఎత్తున కృషి చేయాల్సి ఉంటుందని చెప్పారు. కరోనా కట్టడి కోసం భారత్ చేస్తున్న కృషి అద్భుతమని... మహమ్మారిపై పోరాటంలో కేంద్రంతో పాటు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పారు.

కరోనా అనంతరం ఇతర దేశాల్లోని కంపెనీలు తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో, అవసరమైన మౌలికవసతుల కల్పన కోసం రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయాన్ని అందించాలని కోరారు. చైనా నుంచి తయారీ రంగాన్ని అందిపుచ్చుకోవడానికి భారత్ కు ఇదొక అద్భుత అవకాశమని తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ లో నిర్మిస్తున్న ఔషధ నగరికి మౌలికవసతుల కల్పనకు రూ. 4 వేల కోట్లను కేంద్రం సమకూర్చాలని విన్నవించారు. కరోనా తర్వాత వ్యాపారం కొత్త పంథాలో సాగుతుందని చెప్పారు.

ఉద్యోగుల్లో విశ్వాసాన్ని నింపాలని... వారిలో స్ఫూర్తిని కలిగించడం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు పెను సవాలని కేటీఆర్ అన్నారు. ప్రతి ఉద్యోగికి వ్యక్తిగత పరిశుభ్రత లక్ష్యంగా మారాలని చెప్పారు. కంపెనీలు మానవ వనరులను తగ్గించడం సరికాదని తెలిపారు.

More Telugu News