Karnataka: గ్రీన్ జోన్ దావణగెరెలో ఒక్కరోజులో 21 కరోనా కేసులు... కన్నడనాట కలకలం!

  • వారం క్రితమే గ్రీన్ జోన్ గా ప్రకటన
  • కొందరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు
  • వైరస్ సోకడంతో తిరిగి ఆంక్షల అమలు
21 Cases in One Day in Green Zone Davanagere

నిన్నటి వరకూ గ్రీన్ జోన్ లో ఉన్న కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఆదివారం ఒక్కరోజులో 21 కరోనా పాజిటివ్ కేసులు రావడం అధికారుల్లో తీవ్ర కలకలానికి కారణమైంది. వారం రోజుల క్రితం కంటైన్ మెంట్ పీరియడ్ ముగియడంతో ఈ ప్రాంతాన్ని గ్రీన్ జోన్ గా ప్రకటించారు. ఆపై ప్రజలు కాసింత రిలాక్స్ అయ్యారు కూడా.

ఈ నేపథ్యంలో దావణగెరె ప్రాంతంలోని కొందరిలో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో మొత్తం 164 మంది నమూనాలను సేకరించిన అధికారులు,  వాటిని పరీక్షలకు పంపారు. 21 మందిలో వైరస్ ఉన్నట్టు తేలడంతో, అధికారులు మరోసారి అప్రమత్తం అయ్యారు. ఎవరి నుంచి వారికి కరోనా సోకిందన్న వివరాలపై స్పష్టత లేకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

కాగా, గతంలో ఈ జిల్లాలో 10 పాజిటివ్ కేసులు రాగా, ఒకరు మరణించారు. ఆపై కొత్త కేసులు నమోదు కాకపోవడంతో గ్రీన్ జోన్ గా ప్రకటించారు. తాజా కేసుల నేపథ్యంలో తిరిగి జిల్లాను రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు, లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.

More Telugu News