Pakistan: కరోనా పేరు చెప్పి కరడుగట్టిన ఉగ్రవాదులను విడుదల చేసిన పాకిస్థాన్

Pakistan freed terrorists in the wake corona spreading in prisons
  • జైళ్లలో కరోనా వ్యాపిస్తోందంటున్న పాక్
  • ఉగ్రవాదులకు స్వేచ్ఛ
  • విడుదలైన ఉగ్రవాదుల్లో హఫీజ్ సయీద్
భారత్ పట్ల పాకిస్థాన్ ఎలా వ్యవహరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్ కు వ్యతిరేకంగా, తన ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో పాక్ వైఖరి సుస్పష్టం. ఇప్పుడు కూడా అదే జరిగింది. యావత్ ప్రపంచం కరోనాతో తల్లడిల్లిపోతుంటే, ఈ మహమ్మారి పేరు చెప్పి కరడుగట్టిన ఉగ్రవాదులను జైలు నుంచి విడుదల చేసింది. జైల్లో ఉన్న ఖైదీల మధ్య కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న సాకుతో అనేక మంది ఉగ్రవాదులకు స్వేచ్ఛ ప్రసాదించింది. కరోనా నేపథ్యంలో విడుదలైన వారిలో అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా ఉన్నాడు.

లాహోర్ లోని ఓ జైల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు ఉండగా, వారిలో కొందరికి కరోనా సోకిందని అక్కడి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొన్నాళ్ల కిందట పాకిస్థాన్ పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను అరెస్ట్ చేసి జైళ్లకు తరలించింది. ఉగ్రవాదాన్ని కట్టడి చేయకపోతే బ్లాక్ లిస్ట్ లో చేర్చుతామంటూ ఎఫ్ఏటీఎఫ్ హెచ్చరించడంతో పాక్ దిగి వచ్చింది. కానీ, కరోనా కల్లోలాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని, వైరస్ వ్యాపిస్తుందన్న సాకుతో జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను బయటికి తీసుకువస్తోంది. అంతేకాదు, కొన్నిరోజుల కిందటే పెద్ద సంఖ్యలో ఉగ్రవాదుల పేర్లను నిషిద్ధ ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించి తన వక్రబుద్ధి ప్రదర్శించింది.

కాగా, పాక్ పై ఆర్థిక ఆంక్షలు విధించాలా వద్దా అనేది ఎఫ్ఏటీఎఫ్ వచ్చే నెలలో తేల్చనుంది. ఉగ్రవాదంపై పాక్ తీసుకుంటున్న చర్యల్ని సమీక్షించి ఆ దేశాన్ని బ్లాక్ లిస్టులో చేర్చాలా వద్దా అనేది నిర్ణయిస్తారు.
Pakistan
Terrorists
Corona Virus
Prison
COVID-19
Pandemic

More Telugu News