India: భారత్ లో కరోనా మరణాలకు కొత్త కారణం చెబుతున్న బ్రిటన్ నిపుణుడు

  • ప్రాసెస్డ్ ఫుడ్ నిలిపివేయాలంటున్న ప్రముఖ కార్డియాలజిస్ట్
  • అధిక బరువు కూడా కరోనా మరణాలకు కారణమేననని వెల్లడి
  • కూరగాయలు, పండ్లు, రెడ్ మీట్ మేలని వివరణ
UK expert says poor diet causes deaths in India

చైనాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా బుసలు కొడుతున్న కరోనా వైరస్ భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా దెబ్బకు భారత్ గత కొన్నివారాలుగా లాక్ డౌన్ లో మగ్గుతోంది. ఇప్పటివరకు భారత్ లో 39,980 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,301 మంది మరణించారు.

ఈ పరిణామాలపై బ్రిటన్ నిపుణుడొకరు ఆసక్తికర అభిప్రాయాలు వెల్లడించారు. భారత్ లో కరోనా మరణాలకు ప్రధాన కారణం ఆహార లోపమేనని తెలిపారు. కరోనా మరణాలను నివారించాలంటే భారతీయులు అధికంగా శుద్ధి చేసిన ఆహారాన్ని తీసుకోవడం ఆపేయాలని సూచించారు.

దీనిపై యూకేలో సుప్రసిద్ధ కార్డియాలజిస్ట్ డాక్టర్ అసీమ్ మల్హోత్రా మాట్లాడుతూ, ఊబకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడుతున్న వారు కరోనాకు ఎక్కువగా బలవుతున్నారని, భారత్ లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోందని అన్నారు. భారత్ లో జీవనశైలి సంబంధిత వ్యాధులు ఎక్కువ అని తెలిపారు. టైప్-2 డయాబెటిస్, హైబీపీ, హృద్రోగాలు ఈ మూడు అంశాలు కరోనా మరణాలకు దారితీస్తున్నాయని, శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నవారిలో ఈ ముప్పు మరింత ఎక్కువని అభిప్రాయపడ్డారు.

అధికబరువు కారణంగా సంభవిస్తున్న మరణాలు యూకే, యూఎస్ వంటి పాశ్చాత్య దేశాల్లోనూ చోటుచేసుకుంటున్నాయని వివరించారు. భారతీయుల విషయానికొస్తే, వారు తీసుకునే ఆహారంలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయని, తద్వారా శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయి పెరుగుతుందని వెల్లడించారు.

ఈ పరిస్థితి కారణంగా టైప్-2 డయాబెటిస్, హైబీపీ, హృద్రోగాలు కలుగుతాయని మల్హోత్రా తెలిపారు. ఇలాంటి ఆహారానికి బదులుగా కూరగాయలు, పండ్లు తీసుకోవాలని, మాంసాహారులు పూర్తిగా రెడ్ మీట్ తినాలని, ఆరోగ్యకరమైన ఫ్యాట్ ఉండే పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, చేపలు తినొచ్చని వివరించారు.

More Telugu News