North Korea: ఐదేళ్ల తర్వాత తొలిసారి ఉత్తరకొరియా, దక్షిణ కొరియా మధ్య కాల్పులు

  • ప్రకటించిన దక్షిణ కొరియా 
  • సరిహద్దుల వద్ద ఉద్రిక్తత
  • ఇటీవలే కిమ్‌ అనారోగ్య వార్తలను కొట్టిపారేసిన ఉ.కొరియా
North and South Korea exchange gunfire at border

ఉత్తరకొరియా, దక్షిణ కొరియా మధ్య ఐదేళ్ల తర్వాత తొలిసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. చియోర్వాన్‌లోని ఇరు దేశాల సరిహద్దుల్లో జవాన్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచారు. ఈ కాల్పుల్లో దక్షిణ కొరియా జవాన్లలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ మిలిటరీ తెలిపింది.

మొదట ఉత్తరకొరియా కాల్పులు జరపగా, అందుకు ప్రతిగా కాల్పులు జరిపామని దక్షిణ కొరియా చెప్పింది. తాము రెండు రౌండ్లు కాల్పులు జరిపి ఉత్తరకొరియాకు హెచ్చరిక చేశామని ప్రకటించింది. ఈ కాల్పుల నేపథ్యంలో ఉత్తరకొరియా అధికారులతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

ఆ కాల్పుల ఘటనకు కారణం ఏంటన్న విషయంపై స్పష్టత రాలేదు. కాల్పుల ఘటనతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తత నెలకొంది. దాదాపు ఐదేళ్ల తర్వాత  దక్షిణ కొరియా వైపు ఉత్తరకొరియా నేరుగా కాల్పులు జరిపింది. కొరియా యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో 1953లో బఫర్‌ జోన్‌ (మిలిటరీ లేని ప్రాంతం) ఏర్పాటు చేశారు.  

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ వార్తలు వచ్చిన అనంతరం ఆయనకు సంబంధించిన ఫొటోలను విడుదల చేసిన ఉత్తరకొరియా మీడియా ఆ ప్రచారానికి చెక్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో కాల్పులు చోటు చేసుకోవడం గమనార్హం.

More Telugu News