Tablighi Jamaat: తబ్లిగీ జమాత్ కు మద్దతుగా కామెంట్ చేసిన ఐఏఎస్ అధికారికి నోటీసులు!

  • తబ్లిగీ జమాత్ సభ్యులను హీరోలుగా పేర్కొన్న మొహమ్మద్ మొహ్సిన్
  • వీరి మానవత్వంపై మీడియా స్పందించడం లేదని వ్యాఖ్య
  • మోదీ హెలికాప్టర్ ను చెక్ చేయాలని గతంలో ఆదేశించిన మొహమ్మద్
Karnataka IAS Officer Tweets On Tablighi Jamaat Gets Show Cause Notice

తబ్లిగీ జమాత్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన కర్ణాటక ఐఏఎస్ అధికారి మొహమ్మద్ మొహ్సిన్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 'దేశ సేవలో భాగంగా 300కు పైగా తబ్లిగీ హీరోలు వారి ప్లాస్మాను డొనేట్ చేస్తున్నారు. మీడియా సంగతేంటి? ఈ హీరోల మానవత్వంపై ఏ మాత్రం స్పందించడం లేదు' అంటూ ఏప్రిల్ 27న వివాదాస్పద ట్వీట్ చేశారు.

ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా  స్పందించింది. కర్ణాటక గవర్నర్ పేరు మీద షోకాజ్ నోటీసు ఇస్తున్నట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫామ్స్ అండర్ సెక్రటరీ శ్యామహొల్లా పేరుతో షోకోజ్ నోటీసు జారీ అయింది.

మీరు వ్యవహరించిన తీరు అఖిల భారత సర్వీసులు-1968 నిబంధనల్లోని రూల్ 7ను ఉల్లంఘించేలా ఉందని నోటీసులో పేర్కొన్నారు. మీ మీద క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో ఐదు రోజుల్లోగా సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.

మొహమ్మద్ మొహ్సిన్ లోక్ సభ ఎన్నికల సమయంలో సస్పెండ్ అయ్యారు. ప్రధాని మోదీ హెలికాప్టర్ ను తనిఖీ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేశారు. మళ్లీ ఇప్పుడు తన వివాదాస్పద ట్వీట్ తో షోకాజ్ నోటీసు అందుకున్నారు.

More Telugu News