Jagan: ఏపీ సీఎం జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ల మధ్య వీడియో కాన్ఫరెన్స్!

  • ఒడిశా వలస కూలీల తరలింపుపై చర్చ
  • ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోందన్న నవీన్ పట్నాయక్
  • మీలాంటి నాయకులు స్ఫూర్తిదాయకులు అన్న జగన్
Video conference between Jagan and Navin Patnaik and Daharmendra Pradhan

ఏపీ ముఖ్యమంత్రి జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ల మధ్య ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. లాక్ డౌన్ కారణంగా ఏపీలో చిక్కుకుపోయిన ఒడిశాకు చెందిన వలస కార్మికులు, కూలీల తరలింపుపై ఈ కాన్ఫరెన్స్ లో చర్చించారు. ఇదే విధంగా ఒడిశాలో ఉన్న ఏపీ ప్రజల తరలింపుపై కూడా చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా ఒడిశా సీఎం మాట్లాడుతూ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో ఉన్న ఒడిశా ప్రజలకు మంచి వసతి, భోజన సదుపాయాలను అందించారని అన్నారు. తమ రాష్ట్రానికి తిరిగి వస్తున్న వారికి  అవసరమైన రవాణా సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారని కొనియాడారు. కరోనా వల్ల తలెత్తిన క్లిష్ట సమయంలో కూడా ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోందని ప్రశంసించారు.

ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ, దాదాపు 20 వేల మంది ఒడిశా ప్రజలు తమ రాష్ట్రంలో ఉన్నారని చెప్పారు. రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న వారిలో దాదాపు 1900 మంది ఒడిశాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని... వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మిగిలిన వారిలో సొంత రాష్ట్రానికి ఎవరు వెళ్లాలనుకున్నా... వారికి కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. మీలాంటి నాయకులు స్ఫూర్తిదాయకులు అని నవీన్ పట్నాయక్ ను కొనియాడారు.

ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, విపత్తు సమయంలో ఒడిశా కూలీలను బాగా చూసుకుంటున్నారని ప్రశంసించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర అధికారులు హాజరయ్యారు.

More Telugu News