Chandrababu: 'వీరిని పోలీసులతో కిడ్నాప్ చేయించారు' అంటూ ఫొటోలు పోస్ట్ చేసిన చంద్రబాబు, లోకేశ్

  • సొంత మీడియా ఎవరి మీదయినా అసత్య ప్రచారం చేసుకోవచ్చా?
  • కట్టుకథలు అల్లి వైసీపీ కప్పిపుచ్చుకుంటుంది
  • ఏ మీడియా వాళ్లయినా నిజాన్ని చెబితే దారుణంగా వ్యవహరిస్తున్నారు
  • మైరా టీవీ అధినేత ఆచూకీ కోసం కొందర్ని కిడ్నాప్ చేశారు
chandrababu fires on ap govt

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు జర్నలిస్టులపై వైసీపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. 'సొంత మీడియా ఎవరి మీదయినా, ఎంత అసత్య ప్రచారమైనా చేసుకోవచ్చు. వైసీపీ నేతల అక్రమాలను కట్టుకథలు అల్లి కప్పిపుచ్చవచ్చు. కానీ ప్రజలకు ఏ మీడియా వాళ్లయినా నిజాన్ని చెబితే వైసీపీ వాళ్లు కుతకుతలాడిపోతారు. ఆ మీడియా ప్రతినిధుల పై కక్షగట్టి, అధికార దుర్వినియోగం చేస్తూ వేధిస్తారు' అని చెప్పారు. ఓ మీడియా నిజాలు చెప్పినందుకు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు.

'మైరా టీవీ అధినేత ఆచూకీ కోసం... వారి బంధువులు, మీడియాతో ఏ మాత్రం సంబంధం లేని వెంకటకృష్ణ, విద్యార్థి సవితా వరేణ్య, వారి డ్రైవర్ శ్రీనివాసరావులను పోలీసులతో కిడ్నాప్ చేయిస్తారా? ఏమిటీ అరాచకం? దీన్ని తెలుగుదేశం ఖండిస్తోంది. ప్రభుత్వం వెంటనే వారిని వారి కుటుంబాలకు అప్పగించాలి' అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
 
'ఈ విషయమై తెలుగుదేశం పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధం అవుతుంది. అవసరమైతే మానవహక్కుల సంఘాన్ని సైతం ఆశ్రయిస్తాం. ప్రజా హక్కులను హరిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు' అని చెప్పారు.  

 రాక్షస ఆనందం పొందుతున్నారు: లోకేశ్

నియంత పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది అంటూ నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియా గొంతు నొక్కేందుకు జీఓ 2430 ప్రయోగించి రాక్షస ఆనందం పొందుతున్నారు. దొంగ సొమ్ముతో పెట్టిన జగన్ మీడియా సంస్థల్లో ప్రతినిత్యం అసత్యాలే వండి వారుస్తారు' అని విమర్శించారు.

'మరో మీడియాలో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తప్పులు మీడియా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కూడా తప్పా? ఆఖరికి పోలీసు వ్యవస్థని కూడా భ్రష్టు పట్టిస్తారా? మైరా మీడియా అధినేత ఆచూకీ కోసం ఆయన బంధువులను అర్ధరాత్రి పూట ఒక కిడ్నాప్ తరహాలో తీసుకెళ్తారా?' అని ప్రశ్నించారు.

'అక్రమంగా వారిని నిర్బంధిస్తారా? మీకు అనుకూలంగా వార్తలు రాయకపోతే చంపేస్తాం అని జర్నలిస్టులకు బెదిరింపులా? పులిని అంటూ బిల్డప్ ఇవ్వడం ఎందుకు? దొంగ జిఓల చాటున పిల్లి వేషాలు ఎందుకు జగన్ రెడ్డి గారు' అని నిలదీశారు.

More Telugu News