Raghava Lawrence: పేదలకు పంపిణీ కోసం 100 బస్తాల బియ్యాన్ని లారెన్స్‌కు పంపిన రజనీకాంత్

Super Star Rajinikanth sent 100 bags of rice to Lawrence
  • దాదాపు రూ. 4 కోట్ల సాయాన్ని అందించిన లారెన్స్
  • మరికొందరు అన్నార్తులకు వస్తు రూపంలో సాయం చేయాలని నిర్ణయం
  • సినీ పరిశ్రమలోని ఇతర నటులు ముందుకు రావాలని పిలుపు
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రముఖ దర్శకుడు, నటుడు లారెన్స్‌కు సూపర్‌స్టార్ రజనీకాంత్ అండగా నిలిచారు. తన వంతుగా 100 బస్తాల బియ్యాన్ని లారెన్స్‌కు పంపించారు. ఈ విషయాన్ని లారెన్స్ స్వయంగా వెల్లడిస్తూ రజనీకాంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కమలహాసన్, అజిత్, విజయ్, సూర్య సహా ఇతర నటులు, రాజకీయ నేతలు కూడా ముందుకొచ్చి సాయం చేయాలని ఈ సందర్భంగా లారెన్స్ కోరారు.

తాను చేస్తున్న సినిమాకు సంబంధించి రావాల్సిన 3 కోట్ల రూపాయలను కరోనా సహాయనిధి కోసం విరాళంగా ఇస్తున్నట్టు లారెన్స్ ఇటీవల ప్రకటించారు. ఆయన అలా ప్రకటించిన తర్వాత ఆదుకోవాలంటూ సినీ రంగంలోని పలు సంఘాల నుంచి లారెన్స్‌కు ఫోన్లు వెల్లువెత్తాయి. దీంతో పంపిణీదారులకు రూ. 15 లక్షలు, నడిగర్ సంఘానికి రూ. 25 లక్షలు, పారిశుద్ధ్య కార్మికులకు రూ. 25 లక్షలు చొప్పున దాదాపు రూ. 4 కోట్లు సహాయనిధికి అందించినట్టు లారెన్స్ తెలిపారు.

హిందీలో తాను చేస్తున్న ‘లక్ష్మీబాంబ్ ’ సినిమాకు రావాల్సిన చివరి విడత మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి పంపిస్తున్నట్టు లారెన్స్ ఇది వరకే ప్రకటించారు. కాగా, చాలామంది నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని, వారందరికీ వస్తువుల రూపంలో సాయం చేయాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్న లారెన్స్... ఇందుకోసం ఇతరుల నుంచి సాయాన్ని అర్థించినట్టు తెలిపారు. అందులో భాగంగానే రజనీకాంత్ 100 బస్తాల బియ్యాన్ని పంపించినట్టు తెలిపారు.
Raghava Lawrence
Kollywood
Rajinikanth
Lockdown

More Telugu News