China: వుహాన్ ఆసుపత్రుల గాలిలో కరోనా వైరస్ జాడలు.. ప్రమాదకరమేనా?

  • వుహాన్ ఆసుపత్రుల నుంచి గాలి నమూనాల సేకరణ
  • కొద్ది మొత్తంలో వైరస్ జాడలు
  •  నివాస సముదాయాల గాలిలో కనిపించని వైరస్ జాడ
Coronavirus spikes in Wuhan hospital air

అత్యంత ప్రమాదకారి అయిన కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి లాలాజలం తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని ప్రపంచ వ్యాప్తంగా పలువురు నిపుణులు చెబుతున్నప్పటికీ, గాలి ద్వారాను వ్యాపించే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడీ వార్తలను నిజం చేసేలా చైనాలోని వుహాన్‌లో గాలిలోని తుంపర్లలోనూ వైరస్ జాడలను గుర్తించారు. ఇక్కడి రెండు ఆసుపత్రులలోని గాలిలోని తుంపర్లలో వీటిని గుర్తించినట్టు నేచర్ పత్రికలో ప్రచురితమైన కథనం కలకలం రేపుతోంది.

ఫిబ్రవరి, మార్చి నెలల్లో వుహాన్‌లోని రెన్మిన్ ఆసుపత్రితోపాటు కోవిడ్ బాధితులను క్వారంటైన్ చేసిన తాత్కాలిక కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు గాలి నమూనాలను సేకరించారు. వీటితోపాటు ఓ నివాస సముదాయం, సూపర్ మార్కెట్, రెండు డిపార్ట్‌మెంటల్ స్టోర్ల నుంచి కూడా గాలి నమూనాలను సేకరించి విశ్లేషించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి గాలి నమూనాల్లో కరోనా వైరస్ జాడలను గుర్తించారు.

ఆసుపత్రుల్లో జనం ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలు, ఐసోలేషన్ వార్డులు, బాధితుల గదులు, గాలి సరిగా ఆడని మరుగుదొడ్లలోని గాలిలో కొద్ది స్థాయిలో వైరస్ జాడలు ఉన్నట్టు గుర్తించారు. మిగతా ప్రాంతాల నుంచి సేకరించిన గాలి నమూనాల్లో మాత్రం వైరస్ జాడలు కనిపించలేదు. అయితే, గాలిలోని వైరస్ మనుషులపై ఏమాత్రం ప్రభావం చూపిస్తుందన్న విషయం మాత్రం వెల్లడి కాలేదు.

More Telugu News