Hyderabad: రెండు రోజుల వ్యవధిలో తండ్రీకుమారుల మృతి.. కుటుంబం మొత్తం క్వారంటైన్!

Father and son died Over a period of two days in Vanasthalipuram
  • వృద్ధుడి అంత్యక్రియలు నిర్వహించిన బల్దియా సిబ్బంది
  • వారుంటున్న ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించిన అధికారులు
  • 40 కుటుంబాల హోం క్వారంటైన్
హైదరాబాద్, వనస్థలిపురంలో ఓ కుటుంబంలో కరోనా మహమ్మారి తీవ్ర విషాదం నింపింది. రెండు రోజుల వ్యవధిలో తండ్రీ కొడుకులు మరణించారు. వనస్థలిపురానికి చెందిన వ్యక్తి (48)కి ఇటీవల కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆయన కుటుంబం మొత్తాన్ని అధికారులు క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. బాధిత వ్యక్తి మాత్రం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మరోపక్క, గత నెల 29న అతడి తండ్రి (76) అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలింది. కుటుంబ సభ్యులందరూ క్వారంటైన్ కేంద్రంలో ఉండడంతో బల్దియా సిబ్బంది వృద్ధుడి అంత్యక్రియలు నిర్వహించారు.

మరోవైపు, శుక్రవారం సాయంత్రం వృద్ధుడి మరో కుమారుడు మృతి చెందాడు. రెండు రోజుల వ్యవధిలో తండ్రీకుమారులు మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికే కరోనా బారిన పడిన వృద్ధుడి పెద్ద కుమారుడు గాంధీలో చికిత్స పొందుతుండగా, అతడి తల్లికి కూడా వైరస్ సంక్రమించింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ క్వారంటైన్ కేంద్రంలోనే ఉన్నారు.

బాధిత కుటుంబ సభ్యులు 8 మందికీ కరోనా పరీక్షలు నిర్వహించినట్టు చెప్పిన వైద్యాధికారులు, నేడు రిపోర్టులు వస్తాయని తెలిపారు. కాగా, బాధిత కుటుంబ సభ్యుల్లో ఇద్దరు చనిపోవడం, మిగతా వారందరూ క్వారంటైన్‌లో ఉండడంతో అప్రమత్తమైన అధికారులు వారుంటున్న ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఆ ప్రాంతంలోని 40 కుటుంబాలను హోం క్వారంటైన్ చేశారు.
Hyderabad
Vanasthalipuram
Corona Virus
Quarantine Centre

More Telugu News