Schools: స్కూళ్లు, కాలేజీల్లో భౌతికదూరం పాటించేలా కేంద్రం కసరత్తులు

  • వచ్చే సెప్టెంబరు నుంచి కాలేజీలు, వర్సిటీల్లో నూతన ప్రవేశాలు
  • విద్యాలయాల్లో నూతన సీటింగ్ విధానం అమలు
  • ఉదయం నిర్వహించే అసెంబ్లీ, క్రీడాకార్యక్రమాలు రద్దు
  • స్కూలు యూనిఫాంతో పాటు మాస్కు తప్పనిసరి
Centre plans new seating arrangements and physical distance must in educational institutions

ఇప్పటివరకు ఎంతో కఠినంగా లాక్ డౌన్ అమలు చేసిన కేంద్రం పంథా మార్చింది. కరోనా కేసులు అధికంగా ఉన్న చోట పకడ్బందీగా ఆంక్షలు అమలు చేసి, మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా సడలింపులు ఇచ్చేందుకు సిద్ధమైంది. వచ్చే విద్యాసంవత్సరం నాటికి కరోనా తగ్గుముఖం పట్టకపోవచ్చన్న అంచనాల నేపథ్యంలో, స్కూళ్లు, పాఠశాలల్లో తప్పనిసరిగా భౌతికదూరం పాటించేలా కేంద్రం కసరత్తులు ప్రారంభించింది. విద్యాలయాల్లో నూతన సీటింగ్ ఏర్పాట్లపై సరికొత్త నిబంధనలు రూపొందిస్తోంది. షిఫ్టుల వారీగా తరగతుల నిర్వహణ, మెస్, లైబ్రరీ వినియోగానికి సంబంధించి నూతన నిబంధనలకు రూపకల్పన చేస్తోంది.

వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభానికి ముందే రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేయనుంది. నూతన మార్గదర్శకాలను విద్యాలయాలు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర మానవ వనరుల శాఖ స్పష్టం చేసింది. కాగా, కేంద్ర మానవ వనరుల శాఖ పాఠశాలలకు, కళాశాలలకు వేర్వేరుగా మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. కాలేజీలు, యూనివర్సిటీల్లో కొత్తగా చేరేవారికి సెప్టెంబరు నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది.

విద్యాలయాల్లో ఉదయం నిర్వహించే అసెంబ్లీతో పాటు క్రీడాకార్యక్రమాలు కూడా రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. స్కూలు యూనిఫాంతో పాటే మాస్కును కూడా తప్పనిసరి చేయాలని భావిస్తున్నారు. మెస్ లు, హాస్టళ్లు, స్కూలు బస్సుల్లో భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలన్న అంశాన్ని కూడా ఆదేశాల్లో చేర్చారు. క్యాంటీన్లు, బాత్రూముల్లో చేయాల్సిన, చేయకూడని పనులపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.

More Telugu News