Eatala: కఠినంగా వ్యవహరించకుంటే తెలంగాణ మరో కర్నూలో, మరో గుంటూరో అయ్యుండేది: ఈటల

  • మంత్రి ఈటల మీడియా సమావేశం
  • ఎక్కువ టెస్టులు చేయడం లేదని విపక్షాలు ఆరోపించడం సరికాదని వెల్లడి
  • ఎక్కడపడితే అక్కడ టెస్టులు చేయొద్దని ఐసీఎంఆర్ చెప్పిందన్న ఈటల
Telangana minister Eatala tells corona status in state

తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్టులు పెద్ద సంఖ్యలో నిర్వహించడంలేదని, అందుకే కేసులు తక్కువగా వస్తున్నాయంటూ విపక్షాలు ఆరోపణలు చేయడం సరికాదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హితవు పలికారు. టెస్టులు సరిగా చేయడంలేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని అన్నారు. ఎక్కడ పడితే అక్కడ టెస్టులు చేయొద్దని ఐసీఎంఆర్ చెప్పిందని, లాక్ డౌన్ కఠినంగా అమలు చేయకుంటే తెలంగాణ మరో కర్నూలు కానీ, మరో గుంటూరు కానీ అయ్యుండేదని స్పష్టం చేశారు.

మర్కజ్ లింకులను బయటపెట్టి దేశాన్ని అలర్ట్ చేశామని తెలిపారు. తెలంగాణలో 90 శాతం కేసులకు మర్కజ్ లింకులే కారణమని పేర్కొన్నారు. ముంబయి, బెంగళూరు నగరాల స్థాయిలో జనాభా కలిగివున్న హైదరాబాదులో తాము మర్కజ్ కేసులను వెంటాడి పట్టుకుని ఉండకపోతే, దేశంలోనే అత్యధిక కేసులు హైదరాబాద్ లోనే నమోదయ్యేవని తెలిపారు. విదేశాల్లో కరోనా ఉన్నదని తెలిసి కూడా ఢిల్లీలో మర్కజ్ కు అనుమతి ఇచ్చింది బీజేపీనే అని ఆరోపించారు. ఢిల్లీలో పోలీసులు, శాంతిభద్రతలు మీ అధీనంలోనే ఉండి కూడా ఏం చేశారు? బాధ్యత లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారు అంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మర్కజ్ తో లింకున్న 1244 మందిని గుర్తించి వారిని క్వారంటైన్ కు తరలించే ప్రయత్నం చేస్తే తమ పోలీసులపైనా, వైద్య ఆరోగ్య సిబ్బందిపైనా దాడులు జరిగాయని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. మాకు తుమ్ములు లేవు, దగ్గు లేదు, జలుబు, జ్వరం లేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినా పట్టుదలగా వ్యవహరించామని, వారిలో 200కి పైగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వెల్లడించారు.

తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని కరోనా ప్రభావాన్ని గణనీయంగా నియంత్రించిందని వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 47 శాతం మంది కోలుకున్నారని మంత్రి ఈటల వెల్లడించారు. లక్ష మందికి కూడా వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరును కేంద్రం కూడా అభినందించిందని అన్నారు. కరోనా మరణాలు దాచేస్తే దాగేవి కావని అన్నారు.

More Telugu News