Guntur: గుంటూరు పట్టణం మొత్తం రెడ్ జోన్ లో ఉంది: జిల్లా కలెక్టర్ వెల్లడి

  • గుంటూరు జిల్లాలో కొత్తగా 19 కేసులు
  • జిల్లాలో 306కి చేరిన కరోనా కేసుల సంఖ్య
  • లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్న జిల్లా కలెక్టర్
District collector says entire Guntur town in red zone

గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి మరింత ఉద్ధృతమైంది. ఇవాళ కొత్తగా 19 పాజిటివ్ కేసులు రావడంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.  ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 306కి పెరిగింది. ఇప్పటివరకు 8 మంది చనిపోగా, 97 మంది కోలుకున్నారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. గుంటూరు పట్టణం మొత్తం రెడ్ జోన్ లో ఉందని వెల్లడించారు. రెడ్ జోన్ లో ఉన్నందున అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 21 రోజుల పాటు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేకపోతే రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్ కు వెళుతుందని వివరించారు. లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని హితవు పలికారు.

గుంటూరు జిల్లాలో కరోనా రోగుల చికిత్స కోసం 7 ప్రత్యేక ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు ఉన్న కేసుల్లో ఎవరికీ ఇబ్బందికర పరిస్థితి లేదని స్పష్టం చేశారు. 28 రోజుల పాటు ఎలాంటి కేసులు లేకపోతే సడలింపులు వస్తాయని చెప్పారు. సోషల్ మీడియాలో నిరాధారమైన వార్తలు వస్తున్నాయని, ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ తో మరణిస్తే అతడ్ని దహనం చేయాల్సి వచ్చిందని, దానిపై కొందరు మతపెద్దలు సంప్రదిస్తే వారికి తగిన వివరణ ఇచ్చామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

More Telugu News