Buggana Rajendranath: జగన్‌ కరెక్ట్‌గా చెప్పారు... కరోనాతో సహజీవనం తప్పదు: ఏపీ మంత్రి బుగ్గన

  • ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయం చెప్పింది
  • ఫేస్‌ మాస్కులు జీవితంలో భాగమని మోదీ కూడా అన్నారు
  • దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు ఏపీలో జరుగుతున్నాయి
  • ఇప్పటివరకు 9 ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం
buggana about corona

కరోనాతో సహజీవనం తప్పదని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయం చెప్పిందని, మరోవైపు ఫేస్‌ మాస్కులు జీవితంలో భాగమని ప్రధాని నరేంద్ర మోదీ కూడా అన్నారని ఆయన చెప్పారు. కరోనాపై సీఎం చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యాలని వ్యాఖ్యానించారు.

ఈ రోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైరస్‌ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలని జగన్ ఆలోచిస్తుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో కూర్చుని విమర్శలు చేస్తున్నారని అన్నారు. దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు ఏపీలో జరుగుతున్నాయని చెప్పారు. ఏపీలో కరోనా పరీక్షల కోసం ఇప్పటివరకు 9 ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేగాక, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలో కూడా ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

ఏపీలో అధికంగా పరీక్షలు చేయడం వల్లే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 1,02,460 మందికి పరీక్షలు నిర్వహించామని వివరించారు. ఏపీలో 10 లక్షల‌ జనాభాకు 1919 చొప్పున పరీక్షలు చేసినట్లు చెప్పారు. కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు టీడీపీ నేతలెవరూ సాయం చేయలేదని విమర్శించారు. మరోవైపు, తమ ప్రభుత్వం గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News