Raghuram Rajan: మళ్లీ లాక్‌డౌన్‌కు వెళ్తే అది మరో విధ్వంసకర పరిణామం అవుతుంది: రఘురాం రాజన్

  • రాహుల్ గాంధీతో ముఖాముఖిలో రాజన్
  • కేసులు సున్నాకు చేరుకునేంత వరకు ఆర్థిక వ్యవస్థను తెరవకపోతే ముప్పే
  • సామాజిక సామరస్యమే ప్రజలకు మేలు చేస్తుంది
Another round of lockdown will be devastating says Rajan

దేశంలో కరోనా కేసుల సంఖ్య పూర్తిగా తగ్గేంత వరకు ఆర్థిక వ్యవస్థను తెరవకపోతే ఇబ్బందులు తప్పవని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు అనుసరించాల్సిన అంశాలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా అమెరికా నుంచి రాజన్ మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం ఎలా అన్న రాహుల్ ప్రశ్నకు రఘురాం రాజన్ స్పందిస్తూ దేశంలో కరోనా కేసుల సంఖ్య సున్నాకు తగ్గే వరకు ఆర్థిక వ్యవస్థను తెరవకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

వ్యక్తిగత దూరం పాటించే వీలున్న చోట ఆర్థిక వ్యవస్థలను జాగ్రత్తగా తెరవాలని, మళ్లీ లాక్‌డౌన్‌కు వెళ్తే కనుక అది మరో విధ్వంసకర పరిణామం అవుతుందని అన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు సుమారు రూ. 65 వేల కోట్ల మొత్తం అవసరం వుందని, రూ. 200 లక్షల కోట్ల జీడీపీ ఉన్న భారత్‌లో ఈ మొత్తాన్ని ఖర్చు పెట్టడం భారమేమీ కాదని మరో ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏదో తప్పు జరిగినట్టు తెలుస్తోంది కదా? అన్న రాహుల్ ప్రశ్నకు రాజన్ బదులిస్తూ.. అది నిజమేనన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆదాయాలు, సంపదల్లో అసమానతలు పెరిగిపోవడం కచ్చితంగా ఆందోళన కలిగించే అంశమేనన్నారు. ఇలాంటి మహమ్మారుల సమయంలో చాలామంది ఆదాయాన్ని, భద్రతను కోల్పోతున్నారని అన్నారు. ఈ వ్యవస్థలో తమకూ భాగస్వామ్యం ఉందని విశ్వసించడం చాలా ముఖ్యమని మరో ప్రశ్నకు సమాధానంగా రాజన్ చెప్పారు. సామాజిక సామరస్యం మాత్రమే ప్రజలకు మేలు చేస్తుందని రాజన్ స్పష్టం చేశారు.

More Telugu News