India: కరోనా తరువాత ఇండియానే బెస్ట్... భారీగా పెరుగుతున్న రూపాయి విలువ!

  • వైరస్ నియంత్రణలోకి వస్తే భారీ ఆర్థిక వృద్ధి
  • తాజాగా 63 పైసలు పెరిగిన రూపాయి విలువ
  • దాదాపు 1000 పాయింట్ల లాభంలో సెన్సెక్స్
  • పెరిగిన బంగారం, వెండి ధర
Rupee Gains as FIIs Pump New Investments

ఒకసారి కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తే, ఇండియాలో ఆర్థిక వృద్ధి మిగతా దేశాలతో పోలిస్తే మిన్నగా ఉంటుందన్న భావనలో ఉన్న విదేశీయులు, భారీ ఎత్తున పెట్టుబడులను పెడుతున్న వేళ, యూఎస్ డాలర్ తో రూపాయి మారకపు విలువ లాభపడుతోంది. వరుసగా నాలుగోరోజూ రూపాయి విలువ లాభపడింది. తాజాగా 63 పైసలు పెరిగి రూ. 75.03కు చేరుకుంది. ఇది మూడు వారాల గరిష్ఠస్థాయి కావడం గమనార్హం.

మార్కెట్ గణాంకాల ప్రకారం, ఎఫ్ఐఐ (ఫారిన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్)లు బుధవారం ఒక్కరోజే రూ. 722.08 కోట్ల విలువైన ఈక్విటీ వాటాలను కొనుగోలు చేశారు. లాక్ డౌన్ ముగిసి, ఆర్థిక కార్యకలాపాలు మొదలైతే ఇండియా దూసుకెళుతుందన్న ఆశ పెట్టుబడిదారుల సెంటిమెంట్ ను బలపరిచిందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.

ఇదే సమయంలో గిలియడ్ తయారు చేసిన యాంటీ వైరల్ డ్రగ్ రెమెడీసివిర్ సత్ఫలితాలను ఇస్తుందన్న వార్తలు కూడా మార్కెట్ ను ముందుకు నడిపించాయి. ఇక, ఈ ఉదయం స్టాక్ మార్కెట్ సైతం ఉత్సాహంగా సాగుతోంది. సెన్సెక్స్ 964  పాయింట్లు, నిఫ్టీ 276 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. బంగారం ధర పది గ్రాములకు రూ. 305 పెరిగి రూ. 45,851కి చేరగా, కిలో వెండి ధర రూ. 727 పెరిగి 42,502 వద్ద కొనసాగుతోంది.

More Telugu News