VV Lakshminarayana: కరోనాపై జగన్ సర్కారు చర్యలకు మద్దతిచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

  • వీలైనన్ని ఎక్కువ టెస్టులు మంచిదే
  • కేసుల సంఖ్య పెరిగినా మరణాలు తక్కువే
  • మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మిన్నగా ఏపీ
CBI Ex JD Laxminarayana Supports Jagan Government on Corona Tackle

కరోనా మహమ్మారి కట్టడి విషయంలో వైఎస్ జగన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటున్న చర్యలను సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ సమర్థించారు. లాక్ డౌన్ సమయంలో మరిన్ని టెస్టులను చేయడం మంచిదేనని, ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపించినా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరణాల సంఖ్య తక్కువగానే ఉందని ఆయన గుర్తు చేశారు.

ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణం, అక్కడ జరిపించిన పరీక్షలేనని లక్ష్మీ నారాయణ అభిప్రాయపడ్డారు. కరోనా పరీక్షలను చేయడంలో ఏపీ ప్రభుత్వం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మిన్నగా ఉందని కితాబునిచ్చిన ఆయన, కరోనాపై జగన్ చేసిన వ్యాఖ్యలనూ సమర్థించారు.

లాక్ డౌన్ తో ప్రభుత్వాలకు కొంత వెసులుబాటు కలిగిందని, ప్రజారోగ్యంపై దృష్టిని సారించే సమయం లభించిందని, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం, ఎన్ని ఎక్కువ టెస్ట్ లు చేస్తే అంత మంచిదని లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. టెస్టులు ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నా, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని గుర్తు చేశారు. కరోనా మృతుల్లో ఇతర సమస్యలున్న కారణంగా మరణించిన వారే అధికమని అన్నారు. సాధ్యమైనంత వరకూ వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆయన సూచించారు.

మే 3 తరువాత పంజాబ్, ఒడిశాలు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నామని వెల్లడించాయని, తెలంగాణలో మరో 4 రోజులు లాక్ డౌన్ ఉంటుందని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారని, ఈ లాక్ డౌన్ పీరియడ్ లో ఆరంజ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్చేందుకు కృషి చేయాలని లక్ష్మీ నారాయణ సూచించారు. ఆపై రెడ్ జోన్లపై మరింత దృష్టిని సారించి, మిగతా ప్రాంతాల్లో లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తివేయవచ్చని సూచించారు. 

More Telugu News