Raghuram Rajan: కరోనా మహమ్మారి ప్రభావంపై రఘురామ్ రాజన్ తో రాహుల్ గాంధీ వీడియో చర్చ!

  • రూ. 65 వేల కోట్లు అవసరం
  • పేదలను ఆదుకునేందుకు విడుదల చేయాలి
  • లాక్ డౌన్ ప్రభావంపై సుదీర్ఘ చర్చ
  • వీడియోను విడుదల చేసిన కాంగ్రెస్
Rajan tells Rahul Gandhi that India Need 65 Thousand Crores

ఇండియాలోని పేదలను కరోనా బారి నుంచి కాపాడాలంటే, కనీసం రూ. 65 వేల కోట్లు అవసరం అవుతాయని ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో వీడియో మాధ్యమంగా మాట్లాడిన ఆయన, మహమ్మారి ప్రభావం దేశంపై భవిష్యత్తులో ఎలా ఉండబోతుందన్న విషయంపైనా, లాక్ డౌన్ చూపించే ప్రభావంపైనా సుదీర్ఘంగా చర్చించారు. వారిద్దరి వీడియో చర్చను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.

"దాదాపుగా రూ. 65 వేల కోట్లు కావాలి. ఇది కూడా పూర్తిగా సరిపోదు. కానీ, పేదలు మరింత పేదరికంలోకి వెళ్లకుండా కొంతమేరకు అడ్డుకుంటుంది" అని రాహుల్ అడిగిన ఓ ప్రశ్నకు (కిత్నా పైసా లగేగా?) సమాధానంగా రాజన్ వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ ను సుదీర్ఘకాలం పాటు కొనసాగిస్తూ ఉండటం చాలా సులువని, ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థ ఎంత పతనమవుతుందో కూడా చూస్తుండాలని రఘురామ్ రాజన్ హెచ్చరించారు.

లాక్ డౌన్ ను తొలగించడంలో ఎంతో జాగ్రత్తగా, తెలివితేటలను ప్రదర్శించాల్సి వుందని, ఇండియాలో పనిలేకుండా ఉన్న ప్రజలకు ఎల్లకాలమూ ఆహారాన్ని అందించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవని అభిప్రాయపడిన రాజన్, వ్యవస్థను రీఓపెన్ చేయాలని, ఎక్కడైనా కరోనా కేసులు కనిపిస్తే, వారిని ఐసొలేట్ చేస్తుండాలని తెలిపారు.

కాగా, కరోనా మహమ్మారి, లాక్ డౌన్ ప్రభావాలపై ప్రముఖులతో చర్చించాలని నిర్ణయించుకున్న రాహుల్ గాంధీ, తొలుతగా రఘురామ్ రాజన్ తో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అనుభవజ్ఞులైన మన్మోహన్ సింగ్, చిదంబరం వంటి వారి సలహాలు స్వీకరించాలని సూచించిన రాహుల్, కష్టకాలంలో విలువైన సూచనలు ఇచ్చేందుకు వారు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

ఇక, రాజన్, రాహుల్ మధ్య 30 నిమిషాల పాటు సంభాషణ జరిగింది. ఇండియాలో అసమానతలు తనను బాధిస్తున్నాయని, దేశంలో సాంఘిక మార్పు అనివార్యమని, వివిధ రాష్ట్రాలు, వివిధ రకాలైన సమస్యలతో బాధపడుతూ ఉన్నాయని, అన్ని ప్రాంతాల సమస్యలకూ ఒకే విధమైన పరిష్కారం సరిపడదని, కొవిడ్-19ను నియంత్రించలేమని, ముందు జాగ్రత్త చర్యలు మాత్రమే వైరస్ ను అడ్డుకోగలవని, గతంలో ఎన్నడూ చూడనటువంటి మహమ్మారి ఇదని వారు అభిప్రాయపడ్డారు.

More Telugu News