Rahul Gandhi: భారత సినీ పరిశ్రమకు ఇదొక భయంకరమైన వారం: రాహుల్ గాంధీ

  • రిషి కపూర్ ఒక అద్భుతమైన నటుడు
  • ఆయన లేని లోటు పూడ్చలేనిదన్న రాహుల్
  • షాక్ కు గురయ్యానన్న ప్రకాశ్ జవదేకర్
Terrible Week For Indian Cinema says Rahul Gandhi

భారతీయ సినీ నట దిగ్గజం రిషి కపూర్ మరణ వార్తతో యావత్ దేశం షాక్ కు గురైంది. తన అద్భుతమైన నటనతో దశాబ్దాల పాటు అలరించిన మేటి నటుడు ఇక లేరు అనే వార్తతో విషాదంలో మునిగిపోయింది. రిషి మృతిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

'భారతీయ సినీ పరిశ్రమకు ఇదొక భయంకరమైన వారం. మరొక లెజెండ్ రిషి కపూర్ కూడా వెళ్లిపోయారు. ఒక అద్భుతమైన నటుడు. దశాబ్దాలుగా ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారు. రిషి కపూర్ లేని లోటు పూడ్చలేనిది. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు సానుభూతిని తెలియజేస్తున్నా' అని రాహుల్ ట్వీట్ చేశారు.

రిషి కపూర్ మరణంపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందిస్తూ, మరణ వార్త తనను షాక్ కు గురి చేసిందని చెప్పారు. ఆయన ఒక గొప్ప నటుడు మాత్రమే కాదని, ఒక గొప్ప మానవతావాది అని కొనియాడారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సానుభూతిని తెలియజేశారు.

67 ఏళ్ల రిషి కపూర్ ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

More Telugu News