Lockdown: వణుకు పుట్టిస్తున్న హైదరాబాద్ పోలీసులు.. ఒక్కరోజే 14,427 కేసుల నమోదు!

Hyderabad police book 14427 cases in a single day on lockdown violators
  • లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై ఉక్కుపాదం
  • నిన్న ఒక్క రోజే 1,475 వాహనాల సీజ్
  • అనవసరంగా రోడ్డెక్కే వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అత్యవసర పనులు లేకపోయినా, టైమ్ పాస్ కోసం రోడ్డెక్కుతున్న వారి తాట తీస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై నగర ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తున్నారు.

నిన్న ఒక్క రోజే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 14,427 కేసులను పోలీసులు నమోదు చేశారు. అత్యవసర పనులు లేకున్నా, అనవసరంగా రోడ్లపైకి వచ్చిన 1,475 ద్విచక్ర వాహనాలు, 234 కార్లు, 82 ఆటోలను సీజ్ చేశారు. ద్విచక్ర వాహనంపై డబుల్, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారిపై, డ్రైవింగ్ చేస్తున్న మైనర్లపై, లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. వాహనాలకు సరైన పత్రాలు లేని వారిపై కూడా కేసులను బుక్ చేశారు.

లాక్ డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా పోలీసు అధికారులు మరోసారి హెచ్చరించారు. అనవసరంగా రోడ్డెక్కే వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
Lockdown
Hyderabad Police
Vehicles
Seize
Cases

More Telugu News