మా అమ్మ వచ్చింది.. నన్ను తీసుకు వెళ్లడానికి!: మరణానికి కొన్ని క్షణాల ముందు ఇర్ఫాన్ అన్నది ఇదే!
- మరణాన్ని ముందే ఊహించిన ఇర్ఫాన్
- సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ‘పద్మశ్రీ’ వరకు ఎదిగిన నటుడు
- తన భార్య కోసమైనా బతకాలని ఉందన్న ఇర్ఫాన్
ఆంగ్రేజీ మీడియం సినిమా విడుదలకు ముందు ఇర్ఫాన్ మాట్లాడుతూ.. తన భార్య కోసమైనా బతకాలని ఉందని అన్నారు. తనకు కేన్సర్ సోకిన విషయం తెలిసిన తర్వాత 24 గంటలూ తనతోనే ఉందని, తనను అత్యంత జాగ్రత్తగా చూసుకుందని అన్నారు. తాను ఇప్పటికీ ఇలా ఉన్నాననంటే ఆమే కారణమని పేర్కొన్నారు. పేగు ఇన్ఫెక్షన్‌తో ఇటీవల ముంబైలో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరిన 53 ఏళ్ల ఇర్ఫాన్ అంతలోనే మృతి చెందడం యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది.
ఇర్ఫాన్ ఈ రోజు మృతి చెందడానికి కొన్ని క్షణాల ముందు ఆయన మాట్లాడిన మాటలు గుండెలను పిండేస్తున్నాయి. ‘‘నన్ను తీసుకెళ్లేందుకు మా అమ్మ వచ్చింది’’ అని ఆయన అన్నట్టు ఆ సమయంలో ఇర్ఫాన్ పక్కన ఉన్నవారు పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితమే ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీదా బేగం (95) మృతి చెందారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆమె అంత్యక్రియలు జరగ్గా ఇర్ఫాన్ వెళ్లలేకపోయారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే తల్లి అంత్యక్రియలను చూశారు. ఈ ఘటన ఆయనను మరింత బాధ పెట్టేలా చేసింది. తల్లి మరణంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు.