Nirmala Sitharaman: రాహుల్ గాంధీపై మండిపడుతూ నిర్మలా సీతారామన్ ట్వీట్ల వర్షం!

  • ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ రంగంపై రాహుల్ గాంధీ విమర్శలకు కౌంటర్
  • రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పటిస్తున్నారు
  • మొండి బకాయిల రైటాఫ్ అంటే ఏంటో తెలుసుకోవాలి
  • గత కాంగ్రెస్ పాలనలో ఫోన్‌ బ్యాంకింగ్‌ ద్వారా లబ్ధి పొందారు
Nirmala Sitharamans 13 Tweet Counter To Rahul Gandhis RBI List Attack

దేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ రంగంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ట్వీట్లు చేసి మండిపడ్డారు. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వారు బీజేపీ స్నేహితులని రాహుల్ అనడాన్ని ఆమె తప్పుబట్టారు. రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొండి బకాయిల రైటాఫ్ అంటే ఏంటో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను రాహుల్ అడిగి తెలుసుకోవాలని నిర్మలా సీతారామన్ చురకలంటించారు. రిజర్వు బ్యాంకు నిర్దేశించిన నాలుగేళ్ల ప్రొవిజనింగ్ ప్రకారమే మొండి బకాయిలకు కేటాయింపులు జరిగాయని, ఆ తర్వాతే బ్యాంకులు ఎన్‌పీఏలను రైటాఫ్ చేస్తాయని చెప్పారు.

లోన్ తీసుకున్న వారి నుంచి డబ్బుల రికవరీని మాత్రం కొనసాగిస్తాయని, ఇది రుణ మాఫీ చేసినట్లు కాదని వివరించారు. రుణమాఫీ, రైటాఫ్ మధ్య తేడాలు తెలుసుకుని రాహుల్ మాట్లాడాలని ఆమె విమర్శించారు. రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నప్పటికీ చెల్లించని వారిని మాత్రమే ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు (విల్ ఫుల్ డిఫాల్టర్స్) అంటారని ఆమె వివరించారు.

ఇటువంటి వ్యక్తులు గత కాంగ్రెస్ పాలనలో ఫోన్‌ బ్యాంకింగ్‌ ద్వారా లబ్ధి పొందారని, 2006 నుంచి 2008 మధ్య ఇచ్చిన రుణాలే మొండి బకాయిలుగా మారాయని చెప్పారు. ఈ విషయంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌ రాజన్ గతంలో చేసిన‌ వ్యాఖ్యల్నిగుర్తు చేశారు. విజయ్ మాల్యాతో పాటు మెహుల్‌ ఛోక్సీ వంటివారు ఉద్దేశపూర్వక ఎగవేతదార్లను తిరిగి భారత్‌కు రప్పించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె తెలిపారు.

More Telugu News