Irfan Khan: బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి

  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • అధికారికంగా ప్రకటించిన ఆసుపత్రి
  • కేన్సర్‌ వ్యాధితో పోరాడిన నటుడు
Irfan Khan dies at 54 Shoojit Sircar and Apurva Asrani mourn actors demise

తీవ్ర‌ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ (53) మృతి చెందారు. పెద్ద‌పేగు సంబంధిత వ్యాధితో ఆయ‌న ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుప‌త్రిలో చికిత్స కోసం చేరిన విషయం తెలిసిందే. ఆయన మ‌ర‌ణించాడని ఆసుపత్రి అధికారికంగా ప్రకటన చేసింది.

గత కొన్నేళ్లుగా ఆయన కేన్సర్‌ వ్యాధితో పోరాటం చేశారు. కొన్ని నెలల క్రితం కోలుకున్నారు. మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు.

కాగా, నాలుగు రోజుల క్రితమే ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీద బేగం (95) మృతి చెందిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆమె అంత్యక్రియలు జరగగా ఇర్ఫాన్ ఖాన్ వెళ్లలేకపోయారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే తల్లి అంత్యక్రియలను చూశారు. ఈ ఘటన ఆయనను మరింత బాధ పెట్టేలా చేసింది. తల్లి మరణంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లారని ఆయన మిత్రులు మీడియాకు తెలిపారు.

ఇర్ఫాన్ ఖాన్‌ మృత దేహాన్ని ఆసుపత్రి సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. ఇర్ఫాన్‌ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఓ గొప్ప నటుడిని కోల్పోయామంటూ పలువురు నటులు ట్వీట్లు చేశారు. ఇర్ఫాన్ ఖాన్‌ మృతి గురించి తెలుసుకున్నానని, ఇది చాలా విచారకర వార్త అని బాలీవుడ్ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ సంతాపం వ్యక్తం చేశారు.

కాగా, సలాం బాంబే సినిమాలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు ఇర్ఫాన్ ఖాన్. స్లమ్‌డాగ్‌ మిలియనీర్, మఖ్బూల్, లంచ్‌బాక్స్‌ చిత్రాల్లో  ఇర్ఫాన్‌ ఖాన్‌ అద్భుత నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఆ సినిమాలు ఆయన కెరీర్‌లో మరిచిపోలేని సినిమాలుగా నిలిచాయి.

ఇర్ఫాన్ ఖాన్ పలు ప్రాంతీయ భాషల సినిమాల్లోనూ నటించారు. మహేశ్ బాబు నటించిన సైనికుడు సినిమాలో ఆయన విలన్‌గా నటించారు. ఇర్ఫాన్‌ 2011లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.  2018 మార్చిలో తన అనారోగ్యంపై ఇర్ఫాన్ ఖాన్ ప్రకటన చేశారు.

More Telugu News