Jyothika: ఆలయాలపై జ్యోతిక వ్యాఖ్యలు వివాదాస్పదం.. భార్యను సమర్థించిన సూర్య

Surya supports his wife Jyothika over her comments on temples
  • ఆలయాల తరహాలోనే ఆసుపత్రులు, పాఠశాలలను అభివృద్ధి చేయాలన్న జ్యోతిక
  • జ్యోతిక వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు
  • జ్యోతిక చెప్పిందే స్వామి వివేకానంద చెప్పారన్న సూర్య
హిందూ ఆలయాలకు సంబంధించి సినీనటి, స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆలయాల తరహాలోనే ఆసుపత్రులు, పాఠశాలలను అభివృద్ది చేయాలంటూ గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై కొందరు విమర్శలు గుప్పిస్తుండగా, మరికొందరు ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన భార్యను సూర్య సమర్థించారు. ఆలయాలపై జ్యోతిక చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నామని చెప్పారు. ఈ మేరకు ఓ బహిరంగలేఖను విడుదల చేశారు.

ఒక అవార్డు ఫంక్షన్లో జ్యోతిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు లాక్‌డౌన్ సమయంలో సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయని లేఖలో సూర్య పేర్కొన్నారు. 'చెట్టు ఊరుకున్నా, గాలి వదిలిపెట్టేలా లేదు' అనే సామెత సోషల్ మీడియాకు చక్కగా సరిపోతుందని అన్నారు. ఆలయాలతో సమానంగా పాఠశాలలు, ఆసుపత్రులు అభివృద్ధి చెందాలని చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించారు.

జ్యోతిక మాటలను కొందరు కుట్రగా చూస్తున్నారని సూర్య మండిపడ్డారు. జ్యోతిక చెప్పిన మాటలనే స్వామి వివేకానంద వంటి మహనీయులు కూడా చెప్పారని గుర్తు చేశారు. మంచి విషయాలను చదవని వారికి, వినని వారికి ఇలాంటివి తెలిసే అవకాశం లేదని దెప్పిపొడిచారు. పాఠశాలలు, ఆసుపత్రులను కూడా దేవాలయాలుగా చూడాలనేదాన్ని అన్ని మతాల వారు స్వాగతిస్తున్నారని చెప్పారు. కరోనా విస్తరిస్తున్న ఈ క్లిష్ట సమయంలో కూడా తమకు వేర్వేరు వర్గాల ద్వారా వస్తున్న మద్దతు సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు.
Jyothika
Surya
Kollywood
Tollywood
Temples

More Telugu News