Hyderabad: తల్లిదండ్రులకు దూరంగా ఏడాది పాప... పుట్టిన రోజన్న విషయం తెలుసుకుని స్వయంగా వెళ్లి గిఫ్ట్ ఇచ్చిన సీపీ అంజనీకుమార్!

  • గ్రాండ్ పేరెంట్స్ వద్ద ఉండిపోయిన ఏడాది పాప మైరా
  • విషయం తెలుసుకుని తొలి పుట్టిన రోజును జరిపిన పోలీసులు
  • బహుమతిగా మాస్క్ వేసిన టెడ్డీ బేర్ బొమ్మ
Hyderabad Police Celebrates One Year Old Myra Birthday

ఆ పాప పేరు మైరా. వయసు ఏడాది నిండింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని బర్కత్ పురాలో తాతయ్య వద్ద ఉంటోంది. తల్లిదండ్రులు సందీప్, హరిణి అమెరికాలోని బోస్టన్ లో ఉంటున్నారు. లాక్ డౌన్ వారి మధ్య దూరాన్ని పెంచింది. పాప తొలి పుట్టిన రోజు నాటికి, తల్లిదండ్రులు యూఎస్ నుంచి రాలేని పరిస్థితి. దీంతో ఇక్కడే పాప పుట్టిన రోజు చేయాలని నిర్ణయించిన గ్రాండ్ పేరెంట్స్, పాపకు విషెస్ చెప్పేందుకు రావాలని హైదరాబాద్ పోలీసులను కోరారు.

విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి స్వయంగా పాప ఇంటికి వెళ్లారు. ఆపై మైరా పుట్టిన రోజును జరిపించారు. బహుమతిగా ఓ టెడ్డీ బేర్ బొమ్మ ముఖానికి మాస్క్ వేసి ఇచ్చారు. ఆరోగ్యం, పరిశుభ్రత, ముందు జాగ్రత్త ముఖ్యమన్న సందేశాన్ని ఇచ్చేందుకే ఈ బహుమతిని ఎంచుకున్నామని ఈ సందర్భంగా అంజనీ కుమార్ వెల్లడించారు.

మైరా తల్లిదండ్రులతోనూ ఫోన్ లో మాట్లాడామని ఆయన అన్నారు. "తమ బిడ్డ తొలి పుట్టినరోజు ప్రతి తల్లిదండ్రులకూ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ఈ సమయంలో వారు ఇక్కడ ఉండాల్సింది. కానీ పరిస్థితులు అందుకు సహకరించలేదు. అందుకే పాప పుట్టినరోజును జరిపించాలని హైదరాబాద్ పోలీసుల తరఫున నిర్ణయించాం" అని అన్నారు. తామిచ్చిన తొలి బర్త్ డే గిఫ్ట్ పాప గుర్తుంచుకుంటుందనే భావిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా బ్లూ టూత్ ద్వారా ముందే రికార్డు చేసిన 'హ్యాపీ బర్త్ డే' సాంగ్ ను కూడా పోలీసులు వినిపించారు.

ఇటీవల పాప తల్లిదండ్రులు హైదరాబాద్ కు వచ్చి బిడ్డను కొంతకాలం ఇక్కడే ఉంచాలని భావించి, ఆపై వెనక్కు వెళ్లారని, పాపను తీసుకుని మార్చి 20న వెళ్లాల్సిన తాతయ్య, బామ్మ లాక్ డౌన్ తో వెళ్లలేకపోయారని పోలీసులు వెల్లడించారు. యూఎస్ లో పాప తాతయ్యకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరగాల్సి వుందని తెలిపారు.

More Telugu News