Bihar: హోంగార్డుతో గుంజీలు తీయించిన ఆ అధికారి సస్పెండయ్యాడు!

  • బీహార్‌లోని అరారియాలో ఘటన
  • రెండు రోజుల క్రితం అధికారికి  ప్రమోషన్
  • అధికారికి మద్దతు పలికిన ఏఎస్సై పైనా వేటు
Govt officer who made home guard do squats suspended

మొత్తానికి హోంగార్డుతో గుంజీలు తీయించి క్షమాపణలు చెప్పించుకున్న బీహార్ వ్యవసాయ శాఖ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. అంతేకాదు, అధికారికి మద్దతు పలికిన ఏఎస్సైను కూడా అధికారులు సస్పెండ్ చేశారు. బీహార్‌లోని అరారియాలో జరిగిందీ ఘటన.

కారులో వెళ్తున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మనోజ్‌కుమార్‌ను లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న హోంగార్డు అడ్డుకున్నాడు. దీంతో కోపంగా కారులోంచి దిగిన మనోజ్ కుమార్.. తాను అర్జెంటుగా మీటింగు కోసం వెళ్తున్నానని, లేదంటే సస్పెండ్ చేయించి ఉండేవాడినంటూ హోంగార్డు గణేశ్‌పై చిందులేశాడు. తనను అడ్డుకున్నందుకు గుంజీలు తీయించాడు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పించుకుని కానీ అక్కడి నుంచి కదల్లేదు.

విధుల్లో ఉన్న మరికొందరు పోలీసులు కూడా గణేశ్‌ను తప్పుబట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు, రెండు రోజుల క్రితం ఆ అధికారికి ప్రమోషన్ కూడా లభించడం మరిన్ని విమర్శలకు దారితీసింది.

హోంగార్డుతో గుంజీలు తీయించిన విషయం తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి  డాక్టర్ ప్రేమ్ కుమార్ దృష్టికి చేరడంతో ఆయన వెంటనే స్పందించారు. మనోజ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాపై పోరులో పాల్గొన్న ప్రతి ఒక్కరు యోధుడేనని, అతడు ఏ పోస్టులో ఉన్నా గౌరవించాల్సిందేనని అన్నారు. అంతేకాదు, వ్యవసాయ అధికారికి మద్దతు పలికిన ఏఎస్సై గోవింద్ సింగ్‌ను కూడా పోలీసు శాఖ సస్పెండ్ చేసింది.

More Telugu News